బలమైన సామాజిక ఉద్యమాన్ని నిర్మించాలి
- ప్రముఖ ఆర్థికవేత్త ప్రభాత్ పట్నాయక్
- ఘనంగా చండ్ర రాజేశ్వరరావు శతజయంతి వేడుకలు
- చండ్ర ‘జీవిత చరిత్ర’ పుస్తకావిష్కరణ
సాక్షి, సిటీబ్యూరో: పాశ్చాత్య దేశాల పెత్తనం, అంతర్జాతీయ పెట్టుబడిదారి శక్తులను ఎదుర్కొనేందుకు బలమైన సామాజిక ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని ప్రముఖ ఆర్థికవేత్త, ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ అన్నారు. కమ్యూనిస్టు నాయకుడు చండ్ర రాజేశ్వరరావు శత జయంతి వేడుకలు కొండాపూర్‌లోని ఎన్‌ఆర్‌ఆర్ రిసెర్చ్ సెంటర్‌లోని ఇంద్రజిత్ మెమోరియల్ హాల్‌లో ఆది వారం ఘనంగా జరిగాయి. కార్యక్రమా న్ని పురస్కరించుకుని ‘సోషల్ మూవ్‌మెంట్ అండ్ రోల్ ఆఫ్ లె ఫ్ట్’ అంశంపై అంతర్జాతీయ సెమినార్ నిర్వహిం చారు.
వివిధ దేశాలకు చెందిన లెఫ్ట్ నేతలు ప్రసంగించారు. శతజయంతి వేడుకల కమిటీ అధ్యక్షుడు కె.నారాయణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం లో పట్నాయక్ మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం అంతర్జాతీయ పెట్టుబడిదారులకు తలొగ్గుతోందని ఆరోపించారు. ఫలితంగా వారికి బహుళ ప్రయోజనా లు చేకూర్చే కార్యక్రమాలు చేపట్టడంతో ఆర్థిక సంక్షోభ ప్రభావం దేశంపై పడుతుందన్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వ విధానాల వల్ల దేశ సమగ్రతకు ముప్పుపొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
చండ్ర కు ఘన నివాళి..
శత జయంతిని పురస్కరించుకుని పలువురు నేతలు చండ్ర రాజేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మడమతిప్పని, నిష్టగల కమ్యూనిస్టువాది అని సీపీఐ మాజీ జనరల్ సెక్రటరీ ఏబీ బర్దన్ కీర్తించారు. సామాజిక రోగులకు వైద్యం చేసిన గొప్పవ్యక్తి చండ్ర అని సీపీఐ నేత కె.నారాయణ అన్నారు. పేదల గుండెల్లో ధైర్యాన్ని నింపి వారి లో ప్రశ్నించేతత్వాన్ని రాజేశ్వరరావు రగిల్చారని ఫ్రొఫెసర్ రమా మేల్కోటి కొనియాడారు. అంతకుముందు డాక్టర్ కె.పూర్ణచంద్రరావు రాసిన ‘చండ్ర రాజేశ్వరరావు జీవిత చరిత్ర’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
చండ్ర ఉద్యమ స్ఫూర్తి, ఆయన చేసిన సేవలను వివరి స్తూ డాక్టర్ కిషోర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కార్యక్రమంలో వియత్నాం, క్యూబా, బంగ్లాదేశ్‌లకు చెందిన లెఫ్ట్ నేతలు త్రాన్ క్వాన్‌గ్ తు యెన్, నుయెన్ తి కియెన్‌వాన్, మేరిలేదిస్ డ్యునాస్ మొరాలెస్, సయ్యద్ అబూ జఫార్ అహ్మద్, బిమాల్ బిస్వాస్, సీఆర్ ఫౌండేషన్ జర్నల్ సెక్రటరీ పల్లా వెంకట్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు పాల్గొన్నారు.