
నేడు జగన్ రాక
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం జిల్లాకు రానున్నారు.
- మానుకోటలో వైఎస్సార్ సీపీ ఎన్నికల సభ
- ఎనిమిది ఎకరాల స్థలంలో ఏర్పాట్లు పూర్తి
- విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు ముత్తినేని సోమేశ్వర్‌రావు పిలుపు
హన్మకొండ, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం జిల్లాకు రానున్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి వైఎస్సార్ సీపీ తరఫున తెల్లం వెంకట్రావ్, వైఎస్సార్ సీపీ మద్దతుతో మానుకోట అసెంబ్లీ స్థానం నుంచి సీపీఎం అభ్యర్థి బానోతు సీతారాం నాయక్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ మేరకు ప్రచారంలో భాగంగా మానుకోట శివారు తొర్రూరు రోడ్డులోని బాలాజీ గార్డెన్ సమీపంలో ఎనిమిది ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు వైఎస్.జగన్‌మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని సెగ్మెంట్లల్లో 50 వేల నుంచి 80 వేల మందిని సభకు తరలించేందుకు పార్టీ నాయకులు ఇదివరకే సన్నాహాలు మొదలుపెట్టారు. వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మధ్యాహ్నం 1.30 గంటలకు హెలికాప్టర్‌లో మహబూబాబాద్‌కు చేరుకోనున్నారు.
ఆయన నేరుగా సభ ప్రాంగణానికే రానున్నారు. సభా వేదిక సమీపంలోని ఫాతిమా హైస్కూ ల్ ప్రాంగణంలో హెలిపాడ్ ఏర్పాటు చేశారు. సభకు మానుకోట పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని వైఎస్సార్ సీపీ అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు హాజరుకానున్నారు. జిల్లాలోని ములుగు, డోర్నకల్ అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలు సభలో భాగస్వామ్యలు కానున్నారు.
విజయవంతం చేయాలి : ముత్తినేని
మహబూబాబాద్‌లో వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యే సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలతోపాటు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ముత్తినేని సోమేశ్వర్‌రావు పిలుపునిచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి పేద వర్గాల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇంకా ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆయన పథకాలను కొనసాగించి, పేదలను అదుకునే సత్తా జగన్‌మోహన్‌రెడ్డికే ఉందన్నారు.