సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ఈనెల 17న కలెక్టరేట్ కార్యాల యాన్ని ముట్టడించాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. పంటలకు 7గంటల ఉచిత విద్యుత్‌ను....
జిల్లా కాంగ్రెస్ నేతల తీర్మానం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ :
ఈనెల 17న కలెక్టరేట్ కార్యాల యాన్ని ముట్టడించాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. పంటలకు 7గంటల ఉచిత విద్యుత్‌ను నిరంతరాయంగా సరఫరా చేయాలని, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్‌తో చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా నేతలంతా సమాయత్తమయ్యారు.
అందులో భాగంగా డీసీసీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం జరిగిన సమావేశానికి కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనేత టి.జీవన్‌రెడ్డి, మాజీమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, జి.వివేక్, మాజీ విప్ ఆరెపల్లి మోహన్, జెడ్పీ మాజీ చైర్మన్ ఎ.లక్ష్మణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు ప్రవీణ్‌రెడ్డి, కొమిరెడ్డి రాములుతోపాటు ఎన్నికల్లో ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులు చల్మెడ లక్ష్మీనరసింహారావు, కేతిరి సుదర్శన్‌రెడ్డి, బాబర్‌సలీంపాషా సహా జిల్లా ముఖ్య నేతలంతా హాజరయ్యారు.
సాధారణ ఎన్నికల్లో ఓటమి అనంతరం పార్టీ నేతలంతా ఒకే వేదికపైకి రావడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ పాలనలో రైతులు, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. కరెంటు కోతలతో పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నందున వారి పక్షాన నిలబడాల్సిన అవసరం ఉందని నేతలంతా అభిప్రాయపడ్డారు. బహిరంగ మార్కెట్‌లో విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కనీసం చొరవ కూడా చూపకపోవడాన్ని తప్పుపట్టారు.
అదే సమయంలో ఆహార భద్రత కార్డులు, పింఛన్ల దరఖాస్తుల పేరుతో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు మీడియాలో వస్తున్నా మంత్రులు పట్టించుకోకపోవడం లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తొలుత రైతులకు 7 గంటల ఉచిత విద్యుత్ డిమాండ్‌తో కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించిన కాంగ్రెస్ నేతలు అందులో భాగంగా శుక్రవారం ఉదయం 11 గంటలకు కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించాలని తీర్మానించారు.
కాంగ్రెస్ కార్యకర్తలతోపాటు పెద్ద ఎత్తున రైతాంగాన్ని తరలించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు. సమావేశానంతరం పలువురు నేతలు మీడియాతో మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు. ఎన్నికల్లో కేసీఆర్ విద్యుత్ అంశంపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వీడియో దృశ్యాలను ప్రదర్శించారు. అనంతరం ఆయా నేతలు ఏవరేమన్నారంటే....
రైతుల దీనస్థికి కేసీఆరే బాధ్యుడు : జీవన్‌రెడ్డి
రైతుల దీనస్థితికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి బాధ్యత వహించాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో 54 శాతం వాటా తెలంగాణకు సరఫరా చేయాలని రాష్ర్ట పునర్ వ్యవస్థీకరణ బిల్లులో స్పష్టంగా ఉన్నప్పటికీ దానిని పొందడంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారు. రైతులను ఆదుకునేందుకు ఎంత ధర వెచ్చించైనా బహిరంగ మార్కెట్‌లో విద్యుత్‌ను కొనుగోలు చేస్తామనే వ్యాఖ్యలు ప్రకటనలకే పరిమితమయ్యాయి.
పంట, పండ్ల తోటల నష్టపరిహారం నిధులు విడుదలై నాలుగు నెలలైనా నేటికీ ఒక్కపైసా పంపిణీ చేయలేకపోయారు. ఇంతటి అసమర్ధ పాలనను నా జీవితంలో ఎన్నడూ చూడలేదు. ఏమైనా అంటే చంద్రబాబుపై నెపం మోపుతూ కాలం వెళ్లదీస్తున్నారు. చంద్రబాబు కరెంటు రానీయకుండా అడ్డుపడితే కేసీఆర్ ఏం చేస్తున్నట్లు? ఈ పరిస్థితుల్లో కేసీఆర్ ఇంకా సీఎంగా కొనసాగడానికి అనర్హుడు.
ప్రభుత్వం నిద్రపోతోంది : శ్రీధర్‌బాబు
రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి కారణం టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ముందు చూపులేకపోవడమే కారణం. మా హయాంలో విద్యుత్ సమస్య అనేకసార్లు ఎదురైనా కేంద్రం సహకారంతో అధికమించాం. పదేళ్ల పాలనలో ఒక్క ఎకరం పంట కూడా నష్టపోకుండా చర్యలు తీసుకున్నాం. 4 నెలలుగా ప్రభుత్వం నిద్రపోతోంది.
తెలంగాణకు కరెంట్ కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రాన్ని ఒక్క మాట కూడా అడగలేదని కేంద్ర విద్యుత్ మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యానించడమే ఇందుకు నిదర్శనం. చత్తీష్‌ఘడ్ నుంచి కరెంటు తెస్తానన్న కేసీఆర్ మాటలు ఏమైనట్లు? సామాజిక, ఆర్థిక భద్రత కల్పిస్తున్న రేషన్‌కార్డులను ఆహార భద్రతా కార్డుల పేరుతో సగానికి సగం కుదించడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
రైతులు చనిపోతుంటే తట్టుకోలేకపోతున్నాం : పొన్నం ప్రభాకర్
కేసీఆర్ పాలనలో ఇప్పటి వరకు జిల్లాలో 50 మంది రైతులు బలవన్మరణం చెందారు. కేసీఆర్ మాత్రం బతుకమ్మ పండుగలతో లండన్, సింగపూర్ పర్యటనలతో కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఈ పరిస్థితుల్లో మౌనంగా ఉండటం సరికాదని కాంగ్రెస్ నాయకులంతా ఐక్యంగా ముందుకొచ్చాం. రైతుల పక్షాన నిలబడేందుకు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించాలని నిర్ణయించాం. తెలంగాణలోని ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలిచేలా ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. ఓటమి నైరాశ్యం నుంచి కాంగ్రెస్ శ్రేణలంతా బయటకు వచ్చి రైతుల పక్షాన నిలబడాలని కోరుతున్నా.
రైతులను కోటీశ్వరులను చేయడమంటే ఇదేనా? : జి.వివేక్
టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే రైతులందరినీ కోటీశ్వరులను చేస్తానని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు చేస్తోందేమిటి. తెలంగాణకు 8 వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ ఉంది. ఆ డబ్బుతో విద్యుత్‌ను కొనుగోలు చేసి రైతులను ఎందుకు ఆదుకోవడం లేదు? సోలార్ పవర్‌ను ఏర్పాటు చేసి వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యమున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు?
తుగ ్లక్ పాలనపై బషీర్‌బాగ్ తరహాలోఉద్యమిస్తాం : కటకం మృత్యుంజయం
రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోంది. కరెంట్ లేక రైతులు, ప్రజలు అష్టకష్టాలు పడుతున్నా పట్టించుకోవడం లేదు. ప్రతిపక్ష కాంగ్రెస్ ఎందుకు పట్టించుకోవడం లేదంటూ రైతులు మాపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నందున ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టాం. ఇది తొలిదశ ఆందోళన మాత్రమే కరెంటు సమస్య పరిష్కరించని పక్షంలో బషీర్‌బాగ్ తరహా ఉద్యమాలు చేపడతాం. సమీప భవిష్యత్తుల్లో ఎన్నికలు కూడా లేనందున దీనిని రాజకీయ కోణంలో చూడకుండా ధర్నాను విజయవంతం చేయాలని కోరుతున్నా.