సాక్షి, హైదరాబాద్: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అభయ (22) కిడ్నాప్, గ్యాంగ్‌రేప్ కేసులో ఎల్బీనగర్ కోర్టు బుధవారం తీర్పు వెలువరించనుంది. కేవలం 209 రోజుల్లో దర్యాప్తు, విచారణ పూర్తైతీర్పు రానుండటంతో పోలీసుల పనితీరుపై బాధితురాలి కుటుంబం హర్షం వ్యక్తం చేస్తోంది. నిందితులకు శిక్షలు పడేలా అత్యంత కీలకంగా భావించే 21 మంది సాక్షులను మాదాపూర్ పోలీసులు ఈ కేసులో చేర్చారు. అలాగే ఘటన జరిగిన సమయంలో ఇన్నార్బిట్‌మాల్, బిర్లా మైండ్‌స్పేస్ స్కూల్‌లోని సీసీ కెమెరా ఫుటేజ్‌లు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదికలు బాధితురాలికి బాసటగా నిలిచాయి.
ఈ కేసులో రాష్ట్రంలోనే తొలిసారిగా అమెరికాలో ఉన్న సాక్షిని జడ్జి నాగార్జున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించడం గమనార్హం. బాధితురాలి పక్షాన పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగరాజు, నిందితుల తరపున ఇద్దరు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. బాధితురాలికి అనుకూలంగానే సాక్ష్యాలు ఉన్నాయాని, నిందితులకు జీవిత ఖైదు పడే అవకాశాలున్నాయని పోలీసు అధికారులు భావిస్తున్నారు. అరెస్టైనప్పటి నుంచి నేటి వరకు కూడా నిందితులు చర్లపల్లి జైలులోనే ఉన్నారు. ఇదిలా ఉండగా, ఈ కేసు తీర్పును స్వయంగా వినేందుకు సైబ రాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ బుధవారం ఎల్బీనగర్ కోర్టుకు హాజరుకానున్నారు.
ఆరోజు ఏమైంది...
బెంగళూరుకు చెందిన అభయ (22- పేరు మార్చడం జరిగింది) గౌలిదొడ్డిలోని మహిళా హాస్టల్‌లో ఉంటూ హైటెక్‌సిటీలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజినీర్‌గా పని చేస్తోంది. అక్టోబర్ 18న సాయంత్రం 5.30కి విధులు ముగించుకున్న ఆమె ఇనార్బిట్ షాపింగ్‌మాల్‌కు వెళ్లింది. రాత్రి 7.30కి షాపింగ్ మాల్ నుంచి బయటికి వచ్చి హాస్టల్‌కు వెళ్లేందుకు బస్సు కోసం ఎదురు చూస్తుండగా... ఆమె ఎదుట కారు (ఏపీ09టీవీఏ2762) ఆగింది.
డ్రైవర్ సీట్లో వరంగల్ జిల్లాకు చెందిన వెడిచెర్ల సతీష్ (30), పక్క సీట్లో నల్లగొండ జిల్లా పెన్‌పహాడ్‌కు చెందిన అతని స్నేహితుడు నెమ్మడి వెంకటేశ్వర్లు (28) ఉన్నారు. హాస్టల్ వద్ద డ్రాప్ చేస్తామని అభయను నమ్మించి కిడ్నాప్ చేశారు. లింగంపల్లి వైపు కారును పోనిచ్చారు. బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ దాటాక టేకు చెట్ల పొదల్లోకి కారును తీసుకెళ్లి గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. బాధితురాలు కేసు పెట్టేందుకు మొదట సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో అదనపు డీసీపీ జానకీ షర్మిల కౌన్సెలింగ్ చేయడంతో బాధితురాలు ధైర్యంగా కేసు పెట్టేందుకు ముందుకు వచ్చింది.
పునరావృత్తం కాకుండా...
ఈ ఘటనతో సైబరాబాద్ పోలీసులు ఉలిక్కిపడ్డారు. ఇలాంటి ఘటన పునరావృత్తం కాకుండా ఉండేందుకు మహిళా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు ఐదంచెల భద్రతా వ్యవస్థను రూ.6 కోట్ల వ్యయంతో రూపొందించారు. మహిళల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. ఐటీ కారిడార్ పోలిసింగ్ వ్యవస్థను రూపొందించారు. ఫలితంగా నేటి వరకు అభయ ఘటన వంటిది జరగలేదు. కాగా, ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ దర్యాప్తును పక్కా ప్రణాళికతో త్వరగా పూర్తి చేయించారు.
అభయ కేసులో రేపే తీర్పు
Published Tue, May 13 2014 12:32 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement