
సాక్షి, సిటీబ్యూరో/ఉప్పల్: కరోనా వైరస్ కట్టడిలో భాగంగా రాచకొండ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో ప్రయాణికులను పరిమితికి మించి తీసుకెళ్తున్న ఆటోలు, క్యాబ్‌లపై చర్యలకు ఉప్రమించారు. ఆటోలో డ్రైవర్‌తో పాటు ఇద్దరు, క్యాబ్‌లో ముగ్గురికి మించి కనిపిస్తే 188 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసే ప్రక్రియను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. నగరంలో కేవలం ఆటోలు, క్యాబ్‌లు తిరిగేందుకు వీలు కల్పించడంతో డ్రైవర్లు ఇష్టమొచ్చినట్టుగా వ్యవహరిస్తున్నవారిపై నజర్ పెట్టారు. కొన్నిరోజులుగా రాత్రిళ్లు మాత్రమే చెక్‌పోస్టులు ఏర్పాటు చేసిన రాచకొండ లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు ఇక నుంచి పగటిపూట కూడా వాహనాల రాకపోకలపై నిఘా వేశారు. ప్రభుత్వ జీఓ 68 ప్రకారం నిబంధనలను అందరూ పాటించాల్సిందేనని, లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని సోమవారం రాచకొండ ట్రాఫిక్ డీసీపీ దివ్యచరణ్‌రావు తెలిపారు. ఐపీసీ 188 సెక్షన్ కింద ఆరు నెలల జైలు, లేదంటే రూ.వెయ్యి జరిమానా విధించే అవకాశముందన్నారు. ప్రజా భద్రతను దృష్టిలో ఉంచుకొని కరోనా వైరస్ నియంత్రణ కోసం ఆటోడ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు బాధ్యతగా వ్యవహరించాలని, ట్రాఫిక్ నిబంధనలు తప్పసరిగా పాటించాలని ఆయన సూచించారు.