పరిగి–కొడంగల్ దారిలో స్పీడ్‌గన్‌తో పోలీసుల పర్యవేక్షణ
స్పీడ్‌గా దొరికిపోతారు! వాహనాల మితిమీరిన వేగానికి కళ్లెం వేసేందుకు పరిగి పోలీసులు నియంత్రణ చర్యలు చేపట్టారు. స్పీడ్‌గా దూసుకెళ్లే వాహనాలను గుర్తించి జరిమానాలు విధిస్తున్నారు. ఇందుకోసం స్పీడ్‌గన్‌లు వినియోగిస్తున్నారు. జిల్లా మీదుగా వెళ్లే హైదరాబాద్– బీజాపూర్ అంతర్రాష్ట్ర రహదారిని జాతీయ మార్గంగా మార్చారు. విస్తరణ పనులు కూడా పూర్తి కావస్తున్న నేపథ్యంలో వాహనాల వేగం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇలా వాహనదారులు విపరీతమైన స్పీడ్‌తో దూసుకెళ్లడంతో పాటు ప్రమాదాలకు కారకులవుతున్నారు. ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న పోలీసులు స్పీడ్‌కు కళ్లెం వేసే దిశగా చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా గడిచిన మూడు నెలల కాలంలో 154 స్పీడ్ కంట్రోల్ కేసులు నమోదు చేశారు.
సాక్షి, పరిగి: పరిగి మీదుగా వెళ్లే హైదరాబాద్– బీజాపూర్ రహదారిపై వాహనదారులు ఇటీవల 100 నుంచి 140 స్పీడ్‌తో దూసుకెళుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిని నియంత్రించేందుకు క్రమం తప్పకుండా నిత్యం సాయంత్రం వేళల్లో రహదారిపై స్పీడ్ గన్‌లతో కాచుకుని ఉంటున్నారు. గంటకు 80 కిలోమీటర్ల వేగాన్ని దాటిపోతున్న వాహనదారులకు ఈ చలానా రూపంలో ఫైన్లు విధిస్తున్నారు. ఈ విషయం కొంతమంది వాహనదారులకు సైతం అర్థం కావటంతో పోలీసుల నిఘాలో ఉన్నామనే విషయాన్ని గమనించి వేగం తగ్గించారు. తెలియని వారు మాత్రం స్పీడ్ గన్‌కు దొరికిపోయి జరిమానాలు చెల్లిస్తున్నారు. గడిచిన మూడు నెలల కాలంలో అతి వేగం కారణంగా పోలీసులు రూ.1,59,390 జరిమానా విధించారు.
స్కూల్ బస్సులకు స్పీడ్ గవర్నెన్స్ బిగింపు..
చిన్నారులను తరలించే స్కూల్ బస్‌ల విషయంలో పోలీసులు మరింత పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. అటు పోలీసు శాఖయే కాకుండా ఆర్టీఓ అధికారులు సైతం ఈ అంశాన్ని సున్నితంగా పరిగణించి స్కూల్ బస్‌ల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో 70 ప్రైవేటు పాఠశాలలు ఉండగా వీటి పరిధిలో 100 పైచిలుకు స్కూల్ బస్‌లు ఉన్నట్లు గుర్తించారు. స్కూల్ బస్ విషయంలో నూతనంగా కేంద్రం తీసుకు వచ్చిన ఎంవీఐ యాక్టు ప్రకారం ఇటీవల రెన్యువల్ చేసే సమయంలో స్కూల్ బస్సులన్నింటికీ స్పీడ్ గవర్నెన్స్‌ను బిగించారు. ఇవీ ఆటోమేటిక్ వేగ నియంత్రికలుగా పనిచేస్తూ వేగాన్ని నియంత్రిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment