
నిఘానేత్రం
నగరంలోని గణేశ్‌నగర్‌కు చెందిన శ్రీనివాస్ ఆఫీసుకని బైక్‌పై బయలుదేరా డు. ప్రతిమ మల్టిప్లెక్స్ వద్ద ట్రాఫిక్ ఐలెండ్‌లో ఉన్న కానిస్టేబుల్ బస్టాండ్‌వైపు నుంచి వెళ్తున్న వాహనాలను ఆగమని సైగచేశాడు.
నగరంలోని గణేశ్‌నగర్‌కు చెందిన శ్రీనివాస్ ఆఫీసుకని బైక్‌పై బయలుదేరా డు. ప్రతిమ మల్టిప్లెక్స్ వద్ద ట్రాఫిక్ ఐలెండ్‌లో ఉన్న కానిస్టేబుల్ బస్టాండ్‌వైపు నుంచి వెళ్తున్న వాహనాలను ఆగమని సైగచేశాడు. ఆయన దూరంగా ఉన్నాడు కదా... పట్టుకునేలోపు వెళ్లిపోవచ్చులే... అని పట్టించుకోకుండా బైక్‌ను ఫాస్ట్‌గా పోనిచ్చాడు. సరిగ్గా ఆఫీసు సమయానికి చేరుకుని హమ్మయ్యా.. అని ఊపిరి పీల్చుకున్నాడు. సీన్ కట్ చేస్తే ఐదు రోజుల తర్వాత అతడి ఇంటికి ఓ రిజిష్టర్ పోస్టు వచ్చింది.
తీసుకుని తెరిచి చూస్తే జూలై 8న ప్రతిమ మల్టిప్లెక్స్ వద్ద నిబంధనలు అతిక్రమించారని, రూ. 200 జరిమానా చెల్లించాలని... అతడు జంప్‌చేసిన తీరుతో బండి ఫొటోతో కూడిన చలానా వచ్చింది. అది చూసి అవాక్కయిన శ్రీనివాస్ తాను వెళ్లినప్పుడు ఎవరూ చూడలేదు కదా? అని దీర్ఘాలోచనలో పడిపోయాడు. కానీ, అక్కడే ఉన్న ఓ నిఘానేత్రం అతడిని వెంటాడింది.
- కరీంనగర్ క్రైం
వాహన చోదకులు జాగ్రత్త! ఇష్టారాజ్యంగా వాహనాలు నడిపితే ఇక చెల్లదు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు, కేసులు తప్పవు. నిర్లక్ష్యంగా ట్రాఫిక్ సిగ్నల్ దాటేసినా.. బైక్‌పై ట్రిపుల్ రైడ్ చేసినా... అతివేగంతో దూసుకెళ్లినా... పోలీసులెవరూ చూడట్లేదనుకుంటే తప్పులో కాలేసినట్లే. పోలీసుల ‘కెమెరా’ కళ్లు మీపై నిఘా వేశాయి. అవి నిరంతరం మిమ్మల్ని పర్యవేక్షిస్తుం టాయి. ఫొటో కెమెరాలు ప్రతీక్షణం రోడ్లపై పహరా కాస్తుంటాయి.
పొరపాటున నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారా.. మీరు చేసిన తప్పు ఫొటోతో సహా మీ ఇంటికి ఈ-చలానా రూపంలో వచ్చేస్తుంది. ట్రాఫిక్ విభాగంలో టెక్నాలజీ వినియోగంతో అనేక మార్పులు వస్తున్నాయి. ఇప్పటివరకు హైదరాబాద్‌లాంటి నగరాల్లోనే కనిపించే ఈ చలానా పద్ధతి ఇక జిల్లాలోనూ అమలు కానుంది. నగరంలో అస్తవ్యస్త ట్రాఫిక్‌తో ఇబ్బందులెదురవుతుండడంతో క్రమబద్ధీకరణపై అధికారులు దృష్టిసారించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే అక్కడికక్కడే జరిమానా వేస్తూ చర్యలు తీసుకుంటున్న పోలీసులు తాము ప్రత్యక్షంగా చూడనప్పుడు ఉల్లంఘించే వారి భరతం పట్టాలని నిర్ణయించారు. అలాంటి వాహనాలను వీడియోలో రికార్డు చేసి వాహన నంబర్ అడ్రస్‌కు జరిమానా పంపిస్తారు. ఇదే ఈ చలానా.
కెమెరాలు అందజేత
ఇప్పటికే జిల్లాలోని కీలకమైన కూడళ్లలో సీసీ కెమెరాలు పనిచేస్తుండగా తాజాగా ట్రాఫిక్ పోలీసులకు కూడా 3 వీడియో కెమెరాలు, 3 ఫొటో కెమెరాలు అందించారు. కమాన్, వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్, బస్టాండ్, ప్రతిమ మల్టిప్లెక్స్, తెలంగాణ చౌక్, మంచిర్యాల చౌరస్తా, కోర్టు చౌరస్తాల్లో ప్రత్యేక సిబ్బందిని నియమించి, శిక్షణ ఇచ్చి వీటిని అప్పగించారు. ఉదయం, సాయంత్రం, ఇతర ముఖ్య సమయాల్లో వారు ఈ కెమెరాల్లో అంతా రికార్డు చేస్తారు. ఐదారు రోజులుగా చిత్రీకరణ కొనసాగుతోం ది. ఉల్లంఘనలకు పాల్పడే వారి వాహనం నంబర్ కని పించేలా ఫొటోలు, వీడియో తీసి... వాహనం నంబర్ ప్రకారం ఉన్న చిరునామాకు ఈ చలానా(జరిమానా) పంపిస్తారు.
దీన్ని సమీప ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్లలో లేదా మీసేవ కేంద్రంలో చెల్లించాలి. గడువులోగా జరిమానా కట్టకపోతే వెంటనే వాహనాన్ని సీజ్ చేయడానికి కూడా వెనకాడరు. పదే పదే ఇలా ఉల్లంఘనలకు పాల్పడేవారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం నిబంధనలు ఉల్లంఘించేవారి డాటా మొత్తం ఒకదగ్గర నుంచే పర్యవేక్షిస్తుండ గా... కొద్ది రోజుల్లో ట్రాఫిక్ ముఖ్య సిబ్బందికి హైదరాబాద్‌లో వలే ఎక్కడికక్కడే వాహనం వివరాలు తెలుసుకునే పరికరాలు సమకూర్చే ఆలోచనలు చేస్తున్నారు. ప్రస్తుతం తనిఖీల సమయంలో కొందరు సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారనే విమర్శలుండగా ఈ చలా నా పద్ధతితో అలాంటివాటికి అడ్డుకట్టపడే అవకాశముంది. వాహనదారుల నుంచి నెలకు రూ.3.5 లక్షల కుపైగా జరిమానా వసూలవుతుండగా ఆరు నెలల కాలంలో రూ.20 లక్షలు వసూలైంది. ఈ చలానాతో ఇది మరింత పెరిగే అవకాశముంది. ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు స్టాపర్లు, స్టాప్‌బోర్డులు సైతం ఏర్పాటు చేశారు. నగరంలోని కమాన్ నుంచి తెలంగాణ చౌక్ వరకు అక్కడక్కడ ఉన్న చిన్నచిన్న దారులు ప్రమాదాలకు, అస్తవ్యస్త ట్రాఫిక్‌కు కారణమవుతుండగా ఆయా ప్రాంతాల్లో స్టాపర్లు ఏర్పాటు చేశారు.
ప్రమాదాల నివారణకే..
జిల్లా కేంద్రంలో వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సాఫీ ప్రయాణానికి చర్యలు చేపడుతున్నాం. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారిని కెమెరాల ద్వారా గుర్తించి ఈ చలానా పంపించే కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టాం. ప్రమాదాల నివారణకు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. ప్రజలందరూ సహకరించాలి.
- ఉపేందర్, సీఐ, ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్, కరీంనగర్