ఇన్‌చార్జి కలెక్టర్ శరత్ బదిలీ?
సాక్షి ప్రతినిధి,సంగారెడ్డి: ఇన్‌చార్జి కలెక్టర్ డాక్టర్ శరత్ బదిలీపై వెళుతున్నట్టు సమాచారం. ఉప ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఇందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. నిబంధనల ప్రకారం ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు జిల్లాలో గరిష్టంగా మూడేళ్లలోపు పనిచేసిన వారై ఉండాలి. మూడేళ్లు దాటితే ఇతర ప్రాంతానికి బదిలీ చేస్తారు. ప్రస్తుతం జిల్లా ఇన్‌చార్జిగా పనిచేస్తున్న డాక్టర్ శరత్ 2011 ఆగస్టు 18న జాయింట్ కలెక్టర్‌గా ఇక్కడికి వచ్చారు. ఫుల్‌టైం కలెక్టర్ పనిచేసిన స్మితాసబర్వాల్ జూన్ మాసంలో ముఖ్యమంత్రి సహాయ కార్యదర్శిగా బదిలీపై వెళ్లారు.
ఖాళీ అయిన స్థానంలో కొత్త కలెక్టర్‌ను రాష్ర్ట ప్రభుత్వం నియమించకపోవటంతో అప్పటి నుంచి డాక్టర్ శరత్ ఇన్‌చార్జి కలెక్టర్‌గా కొనసాగుతున్నారు. నిబంధనల ప్రకారం ఆయనే జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారు. అయితే మంగళవారం నాటితో శరత్ విధి నిర్వహణ సమయం మూడేళ్లు దాటింది. ఈ నేపథ్యం ఎన్నికల కమిషన్ ఆయనను బదిలీ చేయవచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ప్రభుత్వం మాత్రం శరత్‌ను ఇక్కడే కొనసాగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.