ఆటాడుకుందాం రా..! | Tree Mini Sports Academies For Bhadradri | Sakshi
Sakshi News home page

ఆటాడుకుందాం రా..!

Published Mon, Jul 23 2018 10:10 AM | Last Updated on Mon, Jul 23 2018 10:10 AM

Tree Mini Sports Academies For Bhadradri - Sakshi

భద్రాచలంలోని గిరిజన సంక్షేమ గురుకులం

భద్రాచలం : గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల విద్యార్థుల అభివృద్ధి కోసం మరో సరికొత్త కార్యక్రమానికి సోమవారం శ్రీకారం చుడుతున్నారు. గురుకుల సంస్థల కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ప్రత్యేక చొరవతో ఇది రూపుదిద్దుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన గురుకులాల్లో 22 చోట్ల మినీ అకాడమీలను ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులను క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు తగిన తర్ఫీదు ఇచ్చే క్రమంలో క్రీడా మినీ అకాడమీలను ఏర్పాటు చేస్తుండటం గిరిజన సంక్షేమ విద్యాశాఖ చరిత్రలో ఇదే ప్రథమం. దీనిలో భాగంగా ఖమ్మం రీజియన్‌కు 3 చోట్ల మినీ క్రీడా అకాడమీలు మంజూరు కాగా, ఇవి భద్రాద్రి జిల్లాకే కేటాయించటం శుభ పరిణామం.

భద్రాచలం, సుదిమళ్ల, కిన్నెరసాని గురుకులాలకు వీటిని మంజూరు చేశారు. భద్రాచలంలోని మినీ అకాడమీని సోమవారం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి గురుకుల సంస్థల కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్, జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హన్మంతు, భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ముఖ్య అతిథులుగా హాజరవుతారని ఆ సంస్థ ఖమ్మం రీజియన్‌ కో ఆర్డినేటర్‌ ఎస్కే బురాన్‌ తెలిపారు. అకాడమీ ప్రారంభోత్సవాన్ని వేడుకగా జరిపేందుకు ఒక్కో చోట ఒక ప్రత్యేకాధికారిని నియమించారు. భద్రాచలంలో ఆర్చరీ, సుదిమళ్లలో బాల్‌ బ్యాడ్మింటన్, కిన్నెరసాని గురుకులంలో వాలీబాల్‌ క్రీడలో తర్ఫీదు ఇచ్చేందుకు ఈ అకాడమీలు ఏర్పాటు కాబోతున్నాయి.  

చదువులతో పాటే క్రీడలు... 
గురుకులాల్లో చదివే విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా మినీ అకాడమీల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇచ్చారు. విద్యార్థులకు చదువుతో పాటు, వారికి ఆసక్తి ఉన్న ఆటలో శిక్షణ ఇచ్చి, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ఈ అకాడమీల్లో తర్ఫీదు ఇస్తారు. ఇందకోసం ఆయా అకాడమీకి ఎంపిక చేసిన క్రీడాంశంలో నైపుణ్యం గల ఫిజికల్‌ డైరెక్టర్‌ను కేటాయిస్తారు. ఒక్కో అకాడమీలో 20 నుంచి 25 మంది విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 147 గురుకులాల నుంచి ఆయా క్రీడల్లో ఆసక్తి, రాణించే విద్యార్థులను ఎంపిక చేసి అకాడమీలకు పంపించేలా ఏర్పాట్లు చేశారు. అడ్మిషన్‌ పొందిన గురుకులంలోనే విద్యార్థి పేరు నమోదవుతుంది. అయితే ఆయా క్రీడకు సంబంధించిన అకాడమీ ఎక్కడ ఉంటే అక్కడికెళ్లి చదవాల్సి ఉంటుంది.  

గిరిజన విద్యార్థులకు ఎంతో మేలు... 
ఖమ్మం రీజియన్‌ పరిధిలో గురుకుల పాఠశాలలు, కళాశాలలు కలిపి 26 విద్యాలయాలు ఉన్నాయి. ఇందులో మొత్తం 8 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే భద్రాద్రి జిల్లాలోనే 21 విద్యాలయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఖమ్మం రీజియన్‌కు మంజూరైన 3 అకాడమీలను జిల్లాకు కేటాయించారు. జిల్లాలో ఇప్పటికే పాల్వంచ మండలం కిన్నెరసానిలో ఆర్చరీకి సంబంధించిన శిక్షణ అందుబాటులో ఉంది. ఇక్కడ తర్ఫీదు పొందిన  విద్యార్థులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించారు. ప్రస్తుతం భద్రాచలం గురుకులంలో శాశ్వతంగా అకాడమీని ఏర్పాటు చేస్తుండటంతో తురుఫు ముక్కల్లాంటి క్రీడాకారులు తయారయ్యే అవకాశం ఉంది. గిరిజన విద్యార్థులకు దీంతో ఎంతో మేలు చేకూరనుంది.  

విద్యార్థులకు ప్రత్యేక డ్రెస్‌కోడ్‌... 
గురుకులాల్లో మినీ అకాడమీలను ఏర్పాటు చేసు ్తన్న నేపథ్యంలో ఆయా చోట్ల ఎంపిక చేసిన విద్యార్థులకు ప్రత్యేక డ్రెస్‌ కోడ్‌ అమలు చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన డ్రెస్‌లను ఆయా గురుకులాలకు సరఫరా చేశారు. షూస్, ట్రాక్‌ షూ కూడా అందజేస్తారు. ఇందుకోసం ప్రతీ గురుకులానికి రూ. 50 వేల చొప్పున నిధులు మంజూరు చేశారు. భద్రాచలం వంటి పాఠశాలలకు బ్యాండ్‌ సెట్‌ అదనంగా సరఫరా చేశారు.  

విద్యార్థుల టూకే రన్‌.. 
గురుకులాల్లో మినీ అకాడమీలను ప్రారంభిస్తున్న నేపథ్యంలో భద్రాచలంలో ఆదివారం విద్యార్థులు టూకే రన్‌ నిర్వహించారు. పాఠశాల ప్రాంగణం నుంచి చర్ల రహదారి వరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో  ఉపాధ్యాయులు సైతం ఉత్సాహంగా పాల్గొన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

భద్రాచలంలో ఆదివారం టూకే రన్‌ నిర్వహిస్తున్న విద్యార్థులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement