టీఆర్‌ఎస్ ప్రభుత్వం కేవలం హామీలకే పరిమితమైందని మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ ఆరోపించారు. మంగళవారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఖానాపూర్ : టీఆర్‌ఎస్ ప్రభుత్వం కేవలం హామీలకే పరిమితమైందని మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ ఆరోపించారు. మంగళవారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీలేదని విమర్శించారు. ప్రభుత్వ హామీలన్నీ ప్రకటనలకే పరిమితమవుతున్నాయన్నారు. సోమవారం జరిగిన జెడ్పీ సమావేశం ప్రజాసమస్యలపై చర్చించకుండా సన్మానాలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు కేసీఆర్ చేసిన హామీల్లో ఏ ఒక్కటి అమలుకు నోచుకోలేదన్నారు.
జిల్లాకు చెందిన వ్యక్తే అటవీశాఖ మంత్రి అయినప్పటికీ రహదారుల నిర్మాణానికి ఆ శాఖ నుంచి క్లియరెన్స్ ఇప్పించకపోవడం శోచనీయమన్నారు. వర్షాభావ పరిస్థితులతో విత్తనాలు మొలకెత్తక రైతులు నష్టపోయినా ప్రభుత్వం వారికి ఉచితంగా విత్తనాలు అందించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తంచేశారు. పంటల రుణమాఫీ వెంటనే అమలు చేయాలన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో అవినీతికి పాల్పడినవారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. పీఏసీఎస్ చైర్మన్ వెంకాగౌడ్, మాజీ సర్పంచ్ ఆకుల శ్రీనివాస్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రామునాయక్, మాజీ ఎంపీపీలు రామేశ్వర్‌రెడ్డి, రాజేశ్వర్‌గౌడ్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు అంకం రాజేందర్, ఉప సర్పంచ్ కారింగుల సుమన్ పాల్గొన్నారు.