
సాక్షి, సూర్యాపేట: టిక్కెట్ రాలేదనే కారణంతో టీఆర్‌ఎస్ నేత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన జిల్లా కేంద్రమైన సూర్యాపేటలో కలకలం రేగింది. టీఆర్‌ఎస్ అధిష్ఠానం టిక్కెట్ కేటాయించలేదని తీవ్ర మనస్తాపం చెందిన టీఆర్‌ఎస్ నేత అబ్ధుల్ రహీం తన నివాసంలో ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. పట్టణంలో 39వవార్డు నుంచి టిక్కెట్ ఆశించిన ఆయన భారీ ఊరేగింపుతో నామినేషన్ దాఖలు చేశారు. రెండు క్రితం నుంచి ప్రచారం చేపట్టారు. అదే వార్డు నుంచి చైర్‌పర్సన్ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న మొరిశెట్టి సుధారాణి కూడా ఇంటింటి ప్రచారం చేసుకుంటున్నారు.. టిక్కెట్ ఖరారు కాకముందే ఇరువురు అభ్యర్థులు పోటీపడి ప్రచారం చేసుకోవడంతో పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. కాగా, మంగళవారం ప్రకటించిన జాబితాలో సుధారాణికి టిక్కెట్ ఖరారు కావడంతో తీవ్ర మనస్తాపం చెందిన రహీం ఉరివేసుకుని ఆత్మహత్యయత్నానికి పాలడ్డారు. సమయానికి స్థానికులు గమనించి ఆయనను కాపాడారు.