టీఆర్‌ఎస్ అధికారం.. కాంగ్రెస్ పెత్తనం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: గులాబీ శిబిరంలో నైరాశ్యం అలుముకుంది. నామినేటెడ్ పదవుల భర్తీలో ప్రభుత్వం కాలయాపన చేస్తుండడంతో పార్టీ నేతల్లో నిర్వేదం వ్యక్తమవుతోంది. నామినేటెడ్ పదవులు రావడంలేదనే బాధ ఒకవైపు వేధిస్తుంటే.. ఇంకోవైపు మార్కెట్ కమిటీ పాలకవర్గాల్లో ఇంకా కాంగ్రెస్ నేతలు తిష్టవేయడం మరింత అసంతృప్తిని ఎగదోస్తోంది. రాష్ట్రంలో అధికారంలో వచ్చింది టీఆర్‌ఎస్ ప్రభుత్వమే అయినా.. మార్కెట్లలో మాత్రం పాతకాపులే కొలువుదీరారు.
ఈ పరిణామం టీఆర్‌ఎస్ శ్రేణులకు షాక్ ఇచ్చింది. గద్దెనెక్కగానే నామినేటెడ్ పదవులు వరిస్తాయని భావించిన నేతలకు భంగపాటు కలిగింది. కీలకమైన మార్కెట్ కమిటీ చైర్మన్‌గిరీలను ఆశించిన పలువురికి మరికొంతకాలం ఆగాల్సిన పరిస్థితి తలెత్తింది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటుచేసిన మార్కెట్ కమిటీ పాలకవర్గాలను కొత్త ప్రభుత్వం రద్దు చేసినప్పటికీ.. ఆయా నేతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే తెచ్చుకోవడంతో వారి పదవీకాలం పూర్తయ్యేవరకు వారిని కదిలించడానికి వీల్లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఏడు మార్కెట్లలో పాతవారే..
జిల్లాలో 11 మార్కెట్ కమిటీలున్నాయి. ఇందులో వికారాబాద్, పరిగి, మేడ్చల్ మార్కెట్ కమిటీలకు పాలకవర్గాల గడువు ముగియడంతో అవి ఖాళీగా ఉన్నాయి. మిగిలిన ఎనిమిదింటికి పాలకవర్గాలు కొనసాగుతున్నాయి. ఈక్రమంలో కొత్త సర్కారు కొలువుదీరిన నేపథ్యంలో నామినేటెడ్ పదవులను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణంగా నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ అంతా అధికార పార్టీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది.
ప్రభుత్వం దిగిపోతే వెనువెంటనే పాలకవర్గాలకు ఆయా నేతలు రాజీనామా చేయడం ఆనవాయితీ. ఈక్రమంలో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులను రద్దు చేసినప్పటికీ.. వాటిని వదిలి పెట్టని పాతకాపులు.. తమ పాలకవర్గం గడువు ముగియకుండానే రద్దు చేయడం తగదంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇలా జిల్లాలోని ఏడు మార్కెట్ కమిటీ చైర్మన్లు కోర్టుకెక్కి పోరాటానికి సిద్ధమయ్యారు.
మద్దతు కూడగట్టుకుని..
కోర్టును ఆశ్రయించిన మార్కెట్ కమిటీ పాలకవర్గాలకు పరిస్థితి అనుకూలంగా మారింది. గడువు ముగియకుండా పాలకవర్గాలను రద్దు చేయవద్దంటూ న్యాయస్థానం సూచించడంతో వారి పదవికి ఆటంకం లేకుండా పోయింది. కోర్టు ఉత్తర్వులతో తిరిగి వారి సీట్లలో ఆసీనులయ్యారు. ఇలా తాండూరు, ఇబ్రహీంపట్నం, సర్దార్‌నగర్, ధారూరు, మర్పల్లి మర్కెట్ కమిటీ పాలకవర్గాలు తిరిగి కొలువుదీరాయి.
శంకర్‌పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ స్థానికంగా లేకపోవడంతో ఆయన వచ్చిన తర్వాత ఒకట్రెండు రోజుల్లో పదవీబాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. నార్సింగి మార్కెట్ కమిటీ పాలకవర్గం కోర్టుకు వెళ్లనప్పటికీ.. వారు సైతం ఇవే ఉత్తర్వులతో తిరిగి బాధ్యతలు తీసుకోనున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. లేదంటే కోరుకెళ్లి ఉత్తర్వులు తెచ్చుకునే అవకాశం లేకపోలేదు. మొత్తంగా న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో నామినేటెడ్ పదవులు ఆశించిన నేతలు మరికొంత కాలం వేచిచూడాల్సిందే.
రెండునెలలే గడువు..
ఇదిలా ఉండగా.. మూడు మార్కెట్ కమిటీల పాలకవర్గాల గడువు త్వరలో ముగియనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చేవెళ్ల, మర్పల్లి, నార్సింగి పాలకవర్గాల గడువు ముగియనుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈక్రమంలో కొత్తగా బాధ్యతలు తీసుకున్నప్పటికీ వారి పదవీకాలం రెండునెలల్లో ముగియనుండడం గమనార్హం.