ఈసారి ఖాయమేనా!
* చందూలాల్‌కు చాన్స్
* కొండా సురేఖ, వినయ్‌లో ఒకరికి అవకాశం
సాక్షి ప్రతినిధి, వరంగల్ : టీఆర్‌ఎస్ సర్కారు ఏర్పడి ఆరు నెలలు పూర్తయిన నేపథ్యంలో నామినేటెడ్ పదవుల పంపకాలతోపాటు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని టీఆర్‌ఎస్ వర్గాలు బలంగా చెబుతున్నాయి. నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తుండగా.. పరిపాలనను మెరుగు పరిచే చర్యల్లో భాగంగా త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని గులాబీ పార్టీ నేతలు భావిస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఉన్నా.. గిరిజన సంక్షేమ శాఖ బాధ్యతలు ఈ వర్గం వారికే అప్పగిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రకటించారు.
కేసీఆర్ తాజా ప్రకటనతో జిల్లాకు చెందిన ములుగు ఎమ్మెల్యే అజ్మీరా చందులాల్‌కు మంత్రి పదవి వరిస్తుందనే చర్చ జోరందుకుంది. టీఆర్‌ఎస్ తరుఫున గెలిచిన గిరిజన ఎమ్మెల్యేల్లో చందులాల్ సీనియర్. గతంలో మంత్రిగా, రెండు సార్లు ఎంపీగా కూడా పని చేశారు. అన్నింటి కంటే ముఖ్యంగా కేసీఆర్‌కు రాజకీయంగా సమకాలికుడు కావడం చందులాల్‌కు అనుకూల అంశంగా కనిపిస్తోంది.
ఎవరికి వారు..
మంత్రివర్గ విస్తరణపై చందులాల్‌తోపాటు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ ఆశలు పెట్టుకున్నారు. వీరు ముగ్గురు సీఎంకు తమ పేర్లు పరిశీలించాని విన్నవిస్తున్నట్లు టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత మంత్రివర్గంలో మహిళలకు ప్రాతినిథ్యం లేదు. మహిళా కోటాలో మంత్రి పదవి వస్తుందని కొండా సురేఖ ఆశాభావంతో ఉన్నారు.
జిల్లాలోని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల్లో సీనియర్‌గా తనకు అవకాశం వస్తుందని వినయభాస్కర్ భావిస్తున్నారు. 2009లో కేసీఆర్ నిరహార దీక్ష తర్వాత ఉద్యమం కీలక సమయంలో వినయభాస్కర్ ఒక్కరే జిల్లాలో ఎమ్మెల్యేగా ఉన్నారు. అన్ని కార్యక్రమాల్లోనూ ప్రత్యక్షంగా పాల్గొన్న వ్యక్తిగా ఆయనకు పార్టీ అధిష్టానం వద్ద గుర్తింపు ఉంది. ఇలా ఎవరికివారు తమకు ఉన్న అనుకూల అంశాలతో మంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్నారు.
ఒక్కరికా.. ఇద్దరికా..?
సాధారణ ఎన్నికల్లో జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో టీఆర్‌ఎస్ ఎనిమిది స్థానాలు గెలుచుకుంది. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణ ఉద్యమంలో, టీఆర్‌ఎస్‌కు ఎన్నికల్లో విజయాలను అందించడంలో జిల్లాకు మొదటి నుంచి ప్రత్యేకత ఉంది.
తెలంగాణ ఉద్యమానికి, టీఆర్‌ఎస్‌కు మొదటి నుంచి వరంగల్ జిల్లాలో మద్దతు అధికంగా ఉంటోంది. తెలంగాణ తొలి ప్రభుత్వంలో రాష్ట్రస్థాయిలో రెండు కీలక పదవులు జిల్లాలోని ఎమ్మెల్యేలకే దక్కాయి. ఉప ముఖ్యమంత్రి పదవి స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే టి.రాజయ్య, స్పీకర్ పదవి భూపాలపల్లి ఎమ్మెల్యే ఎస్.మధుసూదనాచారికి దక్కారుు. ఇలా త్వరలో చేపట్టనున్న మంత్రి వర్గ విస్తరణలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల్లో ఒకరు లేదా ఇద్దరికి చోటు దక్కుతుందని టీఆర్‌ఎస్ జిల్లా శ్రేణులు ఆశిస్తున్నాయి.