సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కొత్తగా పెళ్లయిన జంట హనీమూన్‌కి వెళ్లినట్టు తెలంగాణకు వచ్చారు. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ కుదిరిందో లేదో కానీ కుదరాల్సినవి చాలా ఉన్నాయని టీఆర్‌ఎస్ ఎంపీ బూర నర్సయ్య విమర్శించారు. రాహుల్‌గాంధీ ఓసీడీ వ్యాధితో బాధపడుతున్నారని, ఆ వ్యాధి ఉన్నవారు చేసినవి మర్చిపోతారని, చేసిందే మళ్లీ చేస్తుంటారని చెప్పారు. తెలంగాణ భవన్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘తెలంగాణ ఎన్నికలు చూస్తుంటే రాష్ట్ర ఎన్నికలా జాతీయ ఎన్నికలా అన్నది అర్థం కావడంలేదు. ఇక అంతర్జాతీయ నాయకులు రావడమే మిగిలింది’అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ను రాహుల్ తెలంగాణ రాష్ట్ర సంఘ్ పరివార్ అనడంకన్నా హాస్యాస్పదం మరొకటి లేదు. రాహుల్ పేరులో ఆర్ సోనియా పేరులో ఎస్ ఉందంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అని మేము అనొచ్చా అని ప్రశ్నించారు. చంద్రబాబు తెలంగాణ ప్రాజెక్టులకు సైంధవుడిలా అడ్డుపడ్డారు. అలాంటి చంద్రబాబును తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆత్మగౌరవం లేకుండా తెలంగాణకు తెచ్చారు. గతంలో భారతదేశంపై దండయాత్రకు వచ్చిన అలెగ్జాండర్‌కు అంబీ సహకరించినట్టుగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు చంద్రబాబుకు సహకరిస్తున్నారు. చంద్రబాబు, రాహుల్ చేసేది కచ్చితంగా తెలంగాణపై దండయాత్రే. ఎవరెన్ని దండయాత్రలు చేసినా తెలంగాణ ప్రజలు ఏకపక్షంగా టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్నారు’ అని బూర నర్సయ్య అన్నారు.
కేసీఆర్ 18 గంటలు కష్టపడతారు: ఎమ్మెల్సీ సలీం
టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పట్టుదలగా చేసిన దీక్షతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఎమ్మెల్సీ సలీం అన్నారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌కు ప్రజలెప్పుడూ రుణపడి ఉంటారని చెప్పారు. ఎమ్మెల్సీ ప్రభాకర్‌రావుతో కలిసి సలీం గురువారం తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘తెలంగాణ తెచ్చామని ఇప్పుడు కొందరు మాటలు చెబుతున్నారు. తెలంగాణకు ఏం కావాలో తెలంగాణ బిడ్డగా కేసీఆర్‌కు తెలుసు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు తెలంగాణను ఎండ బెట్టారు. కేసీఆర్ రోజూ 18 గంటలు కష్టపడతారు. ప్రజాకూటమికి ప్రజల్లో బలంలేదు. మళ్ళీ కేసీఆర్ నేతృత్వంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడబోతోంది. టీఆర్‌ఎస్ గెలవకుంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా’అని సలీం అన్నారు.
హనీమూన్‌కి వచ్చినట్టు వచ్చారు
Published Fri, Nov 30 2018 1:30 AM | Last Updated on Fri, Nov 30 2018 1:30 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment