ఆర్టీసీ కార్మికులు సంబురాల్లో మునిగితేలారు. కార్మికుల డిమాండ్లు పరిష్కరించే దిశగా 8 రోజుల నుంచి
నల్లగొండ : ఆర్టీసీ కార్మికులు సంబురాల్లో మునిగితేలారు. కార్మికుల డిమాండ్లు పరిష్కరించే దిశగా 8 రోజుల నుంచి చేస్తున్న సమ్మెకు బుధవారం బ్రేక్ పడింది. కార్మికులు డిమాండ్ చేసిన దానికంటే ఒక శాతం ఎక్కువ ఫిట్‌మెంట్ ప్రకటించడం పట్ల కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. 43 శాతం ఫిట్‌మెంట్ పెంచాలని సంఘాలు డిమాండ్ చేయగా...సీఎం 44 శాతం ఇస్తామని ప్రకటించారు. దీంతో బుధవారం మధ్యాహ్నం వరకు సమ్మెలో ఉన్న కార్మిక సంఘాలు ఒక్కసారిగా రోడ్డుమీదకు వచ్చి సంబురాలు నిర్వహించాయి.
తెలంగాణ తెలుగు తల్లి విగ్ర హానికి పూలమాలలు, సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పలుచోట్ల కార్మికులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. కాగా ఈ సమ్మెలో కార్మికులకు అండగా ఉద్యోగులు సైతం కదలిరావడంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ఇదే క్రమంలో నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టేంచేందుకు అధికారులు, కార్మికులు తమ వంతు కృషి చేయాల్సి ఉంటుంది. దీనిలో భాగంగానే రీజియన్ పరిధిలో ఖర్చు తగ్గించుకుని ఆదాయం పెంచుకునేందుకు వివిధ మార్గాలను అన్వేషించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ ఎనిమిది రోజుల సమ్మె కారణంగా నల్లగొండ రీజియన్‌కు రూ.5.6 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ నష్టాన్ని పూడ్చుకోవడంతో పాటు, మితిమీరిన ఖర్చులను తగ్గించుకునే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
కార్మికుల సంబురాలు...కదిలిన బస్సులు
సీఎంతో జరిపిన చర్చలు సఫలీకృతం కావడంతో సాయంత్రం 4 గంటల నుంచే బస్సులు రోడ్డుమీదకు రావడం మొ దలుపెట్టాయి. గురువారం ఎంసెట్ ప్రవేశ పరీక్ష దృష్ట్యా బుధవార అర్ధరాత్రి అన్ని గ్రామాలకు బస్సులు పంపిం చారు. ప్రత్యేకంగా 115 బస్సులు ఏర్పాటు చేశారు. నల్లగొండ డిపో ఎదుట కార్మికులు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ర్యాలీగా బయల్దేరి వెళ్లి క్లాక్ టవర్ సెంటర్ వద్ద మానవహారం నిర్వహించి బాణాసంచా కాల్చారు.
సూర్యాపేటలో డిపో ఆవరణ నుంచి మొదలుకొని తెలంగాణ తల్లి విగ్రహం వరకు ర్యాలీ తీస్తూ బాణాసంచాలు కాల్చారు. అనంతరం సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నార్కట్‌పల్లి, దేవరకొండలో కార్మికులు, ఉద్యోగులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి తమ హర్షం ప్రకటించారు. మిర్యాలగూడలో కార్మికులు స్వీట్లు పంపిణీ చేసి సంబురాలు నిర్వహించారు. కోదాడలో కార్మికలు స్థానిక బస్టాండ్ నుంచి తెలంగాణ తల్లి విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు.