
తప్పు చేయనప్పుడు ఎందుకు తప్పించుకు తిరగడమని
సాక్షి, హైదరాబాద్ : అజ్ఞాతంలో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై ఆ చానల్ నూతన యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. తనపై తప్పుడు కేసులు బనాయించారని ఆరోపిస్తూ రవిప్రకాశ్ విడుదల చేసిన వీడియోపై చానల్ యాజమాన్యం స్పందించింది. ఈ వీడియోలో రవిప్రకాశ్ చేసిన ఆరోపణలను టీవీ9 యాజమాన్యం ఖండించింది. తప్పుడు కేసులైతే పోలీసుల విచారణకు ఎందుకు హాజరుకావడం లేదని ప్రశ్నించింది. టీవీ9 సంస్థకు చెందిన లోగోను తన సొంతమనడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏబీసీఎల్ సంస్థలో మెజారిటీ వాటా లేకున్నా పెత్తనం చెలాయించేందుకు రవిప్రకాష్ యత్నించాడని, పలు అక్రమాలకు పాల్పడ్డాడని ఆరోపించింది. తప్పు చేయనప్పుడు ఎందుకు తప్పించుకు తిరగడమని నిలదీసింది.
ఇక టీవీ9 కొత్త యాజమాన్యంతో నెలకొన్న వివాదం వల్లే తనపై తప్పుడు కేసులు పెట్టారని రవిప్రకాశ్ ఆరోపించారు. తన కేసుల విషయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, ఓ ఉగ్రవాదిలా ట్రీట్ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. టీవీ9 స్థాపన దగ్గర నుంచి అమ్మకం వరకు చోటు చేసుకున్న పరిణామాలను ఆయన ఈ వీడియోలో వివరించారు. తనను పాలేరులా పనిచేయాలన్నారని, దీనికి అంగీకరించకపోవడంతోనే కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. టీవీ9 లోగో సృష్టికర్త తనేనని, అది తన సొంతమని పేర్కొన్నారు.