మేడ్చల్: నదిలో గల్లంతైన తమ కుమారుడు ఎక్కడో బతికే ఉండొచ్చని భావించారు ఆ తల్లిదండ్రులు. కొడుకు వస్తాడని వేయి కళ్లతో ఎదురుచూస్తున్న వారికి గుండెకోతే మిగిలింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతైన మేడ్చల్ మండలం గౌడవెల్లి విద్యార్థి బస్వరాజు సందీప్‌యాదవ్(20) మృతదేహం మంగళవారం లభ్యమైంది. కుమారుడి మృతి విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. తమ కుమారుడు వస్తాడని వేయికళ్లతో ఎదురుచూసిన వారికి చివరికి దుఃఖమే మిగిలింది.
మంగళవారం ఉదయం 8 గం టల సమయంలో బియాస్ నది అడుగుభాగంలో మంచుగడ్డల మధ్య ఓ మృతదేహం అధికారులకు కనిపిం చింది. అక్కడే ఉన్న తెలంగాణ రాష్ట్ర అధికారులు, విజ్ఞాన్ జ్యోతి కళాశాల యాజమాన్యం మృతుడు సందీప్‌యాదవ్ అయి ఉండొచ్చని అనుమానించారు. దీంతో అతడి తండ్రి బస్వరాజ్ వీరేష్‌కు ఫోన్ చేసి వివరాలు తెలిపారు. మృతుడి ఒంటిపై ఉన్న దుస్తులు, బూట్లు, చేతికి ఉన్న ఉంగరం ఫొటోలను అధికారులు ఎంఎంఎస్ ద్వారా వీరేష్ సెల్‌ఫోన్‌కు పంపించారు. ఉంగరం ద్వారా మృతుడు సందీప్ అని తల్లిదండ్రులు, కుటుంబీకులు గుర్తించారు.
శోకసంద్రంలో సందీప్ కుటుంబం
మంగళవారం సందీప్ మృతి సమాచారం తెలుసుకున్న అతడి తల్లిదండ్రులు బస్వరాజ్ వీరేష్, విజయ ఇంట్లోనే కుప్పకూలిపోయారు. ‘వస్తావనుకున్న నాయక.. మమ్మల్ని విడిచిపెట్టి పోయావా.. నాన్న..’ అని ఆమె రోదించిన తీరు హృదయ విదారకం. సందీప్ తండ్రి వీరేష్ ఒంటరిగా తనలో తానే కులిమిపోయాడు. ‘ఎలాగైనా బతికి వస్తావనుకున్నాను రా..’ అని ఆయన గుండెలుబాదుకున్నాడు. సందీప్ ఇద్దరు సోదరి, ఇతర కుటుంబసభ్యుల రోదనలతో గౌడవెళ్లి శోకసంద్రంలో మునిగిపోయింది. సందీప్ మృతి సమాచారం తెలుసుకున్న గౌడవెళ్లి గ్రామస్తులు పెద్దఎత్తున అతడి ఇంటికి చేరుకొని కుటుంబీకులను ఓదార్చారు. కాగా విజ్ఞాన్ జ్యోతి కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థులు గత నెల 8న హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్లిన విషయం తెలిసిందే.
బుధవారం మృతదేహం గౌడవెళ్లికి..
సందీప్ మృతదేహాన్ని బుధవారం గౌడవెళ్లికి తరలిస్తామని అధికారులు సమాచారం ఇచ్చినట్లు సందీప్ తండ్రి వీరేష్ తెలిపారు. అక్కడే పోస్టుమార్టం నిర్వహించి అక్కడి నుండి విమానం లో ఢీల్లీకి.. శంషాబాద్ ఎయిర్‌పోర్టు కు తీసుకొస్తారన్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మృతదేహాన్ని గౌడవెళ్లికి తీసుకొస్తామని అధికారులు తెలిపినట్లు వీరేశ్ పేర్కొన్నారు.