ఇన్నాళ్లు వచ్చిన రూ.200 అయినా ఎంతోకొంత ఆసరా అయ్యాయి.
నర్సాపూర్ రూరల్, దుబ్బాక: ఇన్నాళ్లు వచ్చిన రూ.200 అయినా ఎంతోకొంత ఆసరా అయ్యాయి. అయితే ఇకనుంచి రూ.1000 వస్తాయనుకుంటే పింఛనే లేకుండా పోయింది. ఇక ఎలా బతకాలి అని అనుకున్నరో ఏమో జిల్లాలో ఓ వృద్ధుడు, వితంతువు మృతిచెందారు. ఈ సంఘటన లు నర్సాపూర్ మండలం చిప్పల్‌తుర్తిలో, దుబ్బాకలో ఆదివారం చోటుచేసుకున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. నర్సాపూర్ మండలం చిప్పల్‌తుర్తి గ్రామానికి చెందిన ఎండి అక్బర్‌అలీ(70) గ్రామంలో శనివారం పెన్షన్‌లు ఇస్తున్నట్లు తెలుసుకొని ఉదయం 10గంటలకు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దకు వెళ్లాడుడు.
సాయంత్రం 5గంటలకు పెన్షన్‌ల పంపిణీ కార్యక్రమానికి జెడ్పీచైర్‌పర్సన్, ఎమ్మెల్యేలు వచ్చి కొంతమందికి పెన్షన్ పంపిణీ చేసి వెళ్లిపోయారు. మిగత వారికి గ్రామ కార్యదర్శి తారసింగ్ రాత్రి 7గంటల వరకు పెన్షన్ పంపిణీ చేశాడు. ఎంతకు తన పేరు రాకపోవడంతో కార్యదర్శిని అడగా నీపేరు లేదు తరువాత జాబితాలో వస్తుందని చెప్పారు. దీంతో మనస్థాపానికి గురైన అతను ఇంటికి వెళ్లి ఈ విషయాన్ని అతని భార్య చెప్పాడు. తనకు పెన్షన్ రాలేదని శనివారం రాత్రి సరిగా భోజనం చేయకుండా ఆలోచిస్తూ పడుకున్నాడు.
అదివారం ఉదయం భార్య అలిమాబీ ఎంత లేపిన లేవకపోవడంతో దగ్గరకు వెళ్లి చూడగా మృతిచెంది ఉన్నాడు. అలీమాబీ రోదనలతో చుటుపక్కల వారు వచ్చి ఆమెను ఓదార్చారు. తనకు సరిగా కళ్లు కనింపిచవని, ఇద్దరు కొడుకులు బతుదెరువు కోసం కొన్ని ఏళ్ల క్రితం హైదరాబాద్ వెళ్లిపోయారంటూ రోదిస్తూ చెప్పడం అక్కడున్న వారందర్నీ కలచివేసింది. పెన్షన్ వచ్చి ఉంటే తన భర్త బతికి ఉండేవాడని ఆరోపించారు. ఈవిషయమై గ్రామ కార్యదర్శి తారసింగ్‌ను వివరణ కోరగా ఆన్‌లైన్‌లో అతని పేరు రాకపోవడంతో మరోసారి దరఖాస్తు ఆన్‌లైన్‌లో పంపించామని చెప్పారు. తుదిజాబితాలో అతని పేరు ఉందని త్వరలో వస్తుందని శనివారం పెన్షన్‌ల పంపిణీ కార్యక్రమం వద్దకు వస్తే చెప్పి ఇంటికి పంపించినట్లు తెలిపారు.
పింఛన్ రాలేదన్న బెంగతో...
నగర పంచాయతీలో ఇటీవల ప్రచురించిన పింఛన్ జాబితాలో పేరు లేదన్న బెంగతో ఓ వితంతువు మరణించింది. ఈ సంఘటన దుబ్బాకలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..నిజామాబాద్ జిల్లా బిక్కనూర్ మండలం రామేశంపల్లి గ్రామానికి చెందిన అల్లం బాల్‌లక్ష్మి(50) భర్త చనిపోవడంతో గత 15 సంవత్సరాలుగా దుబ్బాక పట్టణ కేంద్రంలోనే బీడీలు చుడుతూ నివాసం ఉంటోంది.గతంలో కూడా బాల్‌లక్ష్మికి రూ. 200 పింఛన్ వస్తుండేది. నగర పంచాయతీ అధికారులు ఇటీవల ప్రచురించిన జాబితాలో బాల్‌లక్ష్మి పేరు లేకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై బెంగపెట్టుకోవడమే కాకుండా అనారోగ్యానికి గురైంది. తీవ్ర అనారోగ్యానికి గురైన బాల్‌లక్ష్మిని ఆదివారం హైదరాబాద్‌లోని ఆసుపత్రికి 108 వాహనంలో తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించింది.