కూలిన శిక్షణ విమానం | Two Trainee Pilots Were Killed After A Trainer Aircraft Crashed In Vikarabad District | Sakshi
Sakshi News home page

కూలిన శిక్షణ విమానం

Published Mon, Oct 7 2019 5:16 AM | Last Updated on Mon, Oct 7 2019 5:16 AM

Two Trainee Pilots Were Killed After A Trainer Aircraft Crashed In Vikarabad District - Sakshi

కుప్పకూలిన విమానం

బంట్వారం: ఓ ట్రైనీ విమానం ప్రమాదవశాత్తు కుప్పకూలిన ఘటనలో పైలట్, కో–పైలట్‌ మృతిచెందారు. వికారాబాద్‌ జిల్లా బంట్వారం మండలం సుల్తాన్‌పూర్‌ శివారులో ఈ సంఘటన చోటుచేసుకుంది. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి శిక్షణ విమానం పైలట్‌ ప్రకాశ్‌ విశాల్‌ (25), కో– పైలట్‌ అమన్‌ప్రీత్‌కౌర్‌ (21) కర్ణాటకలోని గుల్బర్గాకు బయల్దేరారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో బంట్వారం మండలం సుల్తాన్‌పూర్‌ సమీపంలోని పత్తిపొల్లాల్లో విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదం ధాటికి పైలట్, కో– పైలట్‌ల శరీరాలు తెగిపడ్డాయి. విమానం తునాతునకలై వాటి శకలాలు ఎగిరిపడ్డాయని విమాన ప్రమాద సమయంలో పొలంలో పనిచేసుకుంటోన్న ఓ వ్యక్తి చెప్పాడు. అలాగే, ఈ విషయాన్ని స్థానిక ఎస్సైకు సమాచారం ఇచ్చాడు.

కలెక్టర్, ఎస్పీ పరిశీలన 
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే కలెక్టర్‌ ఆయేషా మస్రత్‌ ఖానమ్, ఎస్పీ నారాయణ, తహసీల్దార్‌ లలిత ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ధారూరు సీఐ రాజశేఖర్, ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, ఏడుకొండలు పంచనామా జరిపారు. ఎస్పీ అక్కడే ఉండి మృతదేహాలను మర్పల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ అధికారుల బృందం ఘటనా స్థలికి చేరుకుంది. పోలీసులు వారితో మాట్లాడి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. ప్రమాదంతో రెండెకరాల పత్తికి నష్టం వాటిల్లిందని బాధితులు బంటు బాలకృష్ణ, బంటు బాలమణి వాపోయారు. ప్రమాద సమాచారం తెలిసిన చట్టు పక్క గ్రామస్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.

వాతావరణం అనుకూలించకేనా? 
ప్రమాదం జరిగిన సమయంలో భారీ వర్షం కురిసింది. ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వాతావరణం అనుకూలించకపోవడంతోనే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement