
ములుగు/వెంకటాపురం(ఎం): దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన సొరంగం కూలి ఇద్దరు కార్మికులు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం(ఎం) మండలంలోని ఇంచె చెర్వుపల్లి సమీపంలో జరుగుతున్న మెయిన్ జంక్షన్ టన్నెల్ పాయింట్ వద్ద శనివారం అర్ధరాత్రి జరిగింది. మృతుల్లో నేపాల్‌కు చెందిన ఫోర్‌మన్ దిలీప్‌రాయ్(32), వెల్డర్ కరణ్‌బిస్తా(45) ఉన్నారు. వీరు 12 ఏళ్లుగా నవోదయ కోస్టల్ ప్రాజెక్టులో భాగంగా స్వదేశంలో పనిచేశారు. గత ఫిబ్రవరిలో బదిలీపై ఇంచె చెర్వుపల్లి సమీపంలో జంక్షన్ మెయిన్ టన్నెల్ ఆడిట్–1ఏకి వచ్చారు.
కాగా, మూడు రోజుల క్రితమే ఇక్కడ నూతన జంక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా సొరంగంలో కార్మికులు పనులు చేయడానికి ముందు మట్టి కూలకుండా రాక్ బోల్టులను ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాతే ఇనుప రిబ్బులను వేస్తారు. అయితే, రాక్‌బోల్టులు వేయడానికి టన్నెల్‌లోకి అర్ధరాత్రి సమయంలో వెళ్లిన ఇద్దరు పైభాగంలో వదులుగా ఉన్న మట్టి ప్రాంతాన్ని గమనించలేదు. సుమారు 3 నుంచి 4 టిప్పర్ల మట్టి ఒక్కసారిగా వీరి మీద పడటంతో అక్కడికక్కడే మృతిచెందారు. తోటికార్మికులు మట్టి తొలగించినా అప్పటికే వారు చనిపోయారు. జియాలజిస్ట్ అనుమతులు ఇచ్చాకే రాక్‌బోల్టుల ఫిట్టింగ్ పనులు చేపట్టాలని, కానీ ఉన్నతాధికారుల పరిశీలన పూర్తి కాకముందే పనులు చేపట్టడానికి లోపలికి వెళ్లడంతో ప్రమాదం జరిగిందని తోటికార్మికులు ఆరోపిస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని కోస్టల్ ప్రాజెక్టు డీఎం ప్రసాద్, ప్రాజెక్టు మేనేజర్ నాయుడు, ములుగు సీఐ సాయిరమణ, వెంకటాపురం(ఎం) ఎస్‌ఐ పోగుల శ్రీకాంత్ పరిశీలించి వివరాలు సేకరించారు. ఆదివారం పనులను నిలిపివేశారు.
Comments
Please login to add a commentAdd a comment