
సాక్షి, సూర్యాపేట: కాంగ్రెస్ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న పోలీసు అధికారుల తీరుకు నిరసనగా రెండు రోజుల్లో హుజూర్‌నగర్ సెంటర్‌లో సామూహిక ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని టీపీసీసీ చీఫ్, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రకటించారు. సోమవారం సూర్యపేటలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో గెలవడానికి మంత్రి హింసను ప్రేరేపిస్తున్నారని అన్నారు. అయితే హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీ సునాయసంగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీలో పడవ ప్రమాదంలో మృతి చెందిన వారికి కాంగ్రెస్ పార్టీ తరుపున ఆయన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
సూర్యాపేట జిల్లా ఎస్పీ ఎస్పీకి అసలు పని చేసే అర్హత లేదని, అధికార పార్టీకి తొత్తుగా మారారని ఉత్తమ్ మండిపడ్డారు. అంతేకాక సదరు పోలీసు అధికారి తీరుపై కోర్టును ఆశ్రయిస్తామని ఆయన హెచ్చరించారు. హుజూర్‌నగర్‌లో మంత్రి జగదీశ్ రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తూ నేరస్తులు, పోలీసుల వెంట తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఆంధ్ర అధికారులతో తెలంగాణ ప్రజలను మంత్రి వేధిస్తున్నారని ఉత్తమ్ విమర్శించారు. కాంగ్రెస్ కార్యకర్తలను భయపెట్టి, అక్రమకేసులు బనాయించి టీఆర్‌ఎస్ పార్టీలో చేర్చుకుంటున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్ పార్టీలో త్వరలోనే విస్ఫోటనం జరగనుందనీ, కేసీఆర్ తీరుఫై ఆ పార్టీ నాయకులే అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు. మాదిగలకు మంత్రివర్గంలో చోటు కల్పించకుండా వారిని కేసీఆర్ అవమానించారని దుయ్యబట్టారు.