
ఏసీబీ ఎదుట హాజరైన నరేందర్‌రెడ్డి
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో టీడీపీ నేత వేం నరేందర్‌రెడ్డి నేడు ఏసీబీ అధికారులు హాజయ్యారు. ఏసీబీ ఇచ్చిన నోటీసుల మేరకు విచారణ కోసం ఆయన బుధవారం ఉదయం ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. ముడుపుల వ్యవహారంలో ఆయన పాత్ర, సూత్రధారులు ఎవరు, ఎమ్మెల్యేను కొనేందుకు డబ్బులెవరు ఇచ్చారనే దానిపై నరేందర్ రెడ్డిని ఏసీబీ అధికారులు ప్రశ్నించే అవకాశముంది.
నరేందర్‌రెడ్డిని అరెస్ట్ చేసేందుకు ఏసీబీ అధికారులు మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆయన నివాసానికి వెళ్లారు. అయితే గుండె వ్యాధితో బాధపడుతున్నందున ఇప్పుడు రాలేనని ఆయన విజ్ఞప్తి చేయడంతో అధికారులు వెనక్కి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన నేడు ఏసీబీ ఎదుట హాజయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన నరేందర్ రెడ్డి గెలుపు కోసమే బేరసారాలు జరుపుతూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఏసీబీకి చిక్కారు. మరోవైపు టీడీపీ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకరరావు ఈ ఉదయం నరేందర్ రెడ్డిని కలిశారు.
ఈ కేసులో మరో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా ఏసీబీ నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న తర్వాత స్పందిస్తానని ఆయన చెప్పారు.