
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ రద్దు చేసిన రోజు నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచే వరకు తెరవెనుక సహకరించిన బీజేపీ రుణం తీర్చుకునేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బాగా ఆరాట పడుతున్నారని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి దుయ్యబట్టారు. ఈ మేరకు బుధవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ తెరచాటు ప్రయత్నాలు చేసి, మళ్లీ ఎన్డీఏను అధికారంలోకి తెచ్చేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని సాగనంపి, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమిని అధికారంలోకి తెచ్చేందుకు దేశంలోని ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయని పేర్కొన్నారు. ఈ తరుణంలో యూపీఏ బలపడకుండా అడ్డుకునేందుకే మమతాబెనర్జీ, నవీన్ పట్నాయక్‌లతో మంతనాల పేరుతో కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ వేసుకున్న బీజేపీ ముసుగు త్వరలో తొలగిపోయి నిజస్వరూపం బయటపడటం ఖాయమని తెలిపారు.