ఆదిలాబాద్‌ల నిమజ్జనానికి తరలిస్తున్న రుద్రాక్ష గణేష్ మండలి వినాయకుడు
ఎదులాపురం(ఆదిలాబాద్): పదకొండు రోజులపాటు పూజలందుకున్న గణనాథులు గంగమ్మ ఒడికి చేరాయి. ఆదివారం ఆదిలాబాద్ పట్టణంలో వినాయక నిమజ్జన శోభాయాత్ర కన్నుల పండువగా సాగింది. ఆనందోత్సహాల నడుమ ఆయా వినాయక మండపాల వారు నృత్యాలు, కోలాటాల మధ్య గణపయ్యకు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా యువకులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా ప్రత్యేక వాహనాల్లో ఏర్పాటు చేసిన సెట్టింగ్‌లు మైమరిపించాయి. నిమజ్జన శోభాయాత్రను చూసేందుకు భక్తులు జిల్లా కేంద్రం నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీ ఎత్తున తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మున్సిపాలిటీ, పలు సంఘాలు, పార్టీల ఆధ్వర్యంలో మంచినీటి వసతి, తాత్కాలిక మరుగుదొడ్ల సౌకర్యం కల్పించారు. పులిహోర, తదితర వాటిని భక్తులకు పంపిణీ చేశారు.
మట్టి విగ్రహాలను ప్రతిష్టించి పర్యావరణాన్ని కాపాడుకుందాం..
మట్టి విగ్రహాలతో పర్యావరణానికి ఎలాంటి ముప్పు ఉండదని, వచ్చే ఏడాది ప్రతిఒక్కరూ మట్టి విగ్రహాలను ప్రతిష్టించి పర్యవరణ పరిరక్షణకు సహకరించాలని ఆపద్ధర్మ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు. కులమతాలకు అతీతంగా ఆనందోత్సాహాలతో పండుగలను జరుపుకోవాలని అన్నారు. ఆదివారం పట్టణంలోని వినాయక్‌చౌక్‌లో గల శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో హిందు ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందువుల సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ ప్రతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని అన్నారు. ప్రతియేటా నిర్వహించే గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఆదిలాబాద్‌లో ప్రజలందరూ ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకుంటారని పేర్కొన్నారు.
అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా శాంతియుతంగా నిమజ్జన కార్యక్రమాన్ని ముగించాలని కోరారు. ప్రతియేటా రాష్ట్ర ఖైరతాబాద్‌లో భారీ వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించేవారని, ఈసారి జిల్లాకేంద్రంలో 58 అడుగుల భారీ వినాయకుడిని ప్రతిష్టించి ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేకతను చాటిచెప్పారని అన్నారు. అంతకుముందు సరస్వతీ పాఠశాలలో ప్రతిష్టించిన గణనాథునికి కలెక్టర్ దివ్యదేవరాజన్, ఎస్పీ విష్ణు ఎస్.వారియర్, బీజేపీ నాయకులు పాయల శంకర్, హిందు ఉత్సవ సమితి నాయకులు జంగిలి ఆశన్న, తదితరులతో కలిసి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు హిందు ఉత్సవ సమితి నాయకులు పాల్గొన్నారు.
అలరించిన నృత్యాలు..
వినాయక నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలో యువకులు చేసిన నృత్యాలు అలరించాయి. దీంతోపాటు గుస్సాడీ వేషధారణలో చేపట్టిన నృత్యాలు మైమరిపించాయి. బ్యాండ్ మేళాలతో యువతీ యువకులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. సంప్రదాయంగా భజనలు చేస్తూ వినాయకులను నిమజ్జనానికి తరలించారు. పట్టణంలో నిమజ్జన శోభాయాత్రను తిలకించేందుకు భారీ ఎత్తున భక్తులు చేరుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది.
భారీ పోలీసు బందోబస్తు..
పట్టణంలో వినాయక నిమజ్జన శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు ప్రత్యేక బలగాలతో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులను మోహరించారు. ఎస్పీ విష్ణు ఎస్.వారియర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బందోబస్తులో ఇద్దరు ఏఎస్పీలు, నలుగురు డీఎస్పీలు, 11 మంది సీఐలు, 40 మంది ఎస్సైలు, 390 మంది ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. వీరితో పాటు బాంబ్‌స్క్వాడ్, డాగ్‌స్క్వాడ్, షీటీమ్ పోలీసులు విధులు నిర్వహించారు. కరీంనగర్ డీఐజీ ప్రమోద్‌కుమార్ గణేష్ నిమజ్జనం సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలో పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment