ఓటరు జోరు..
ఓట్ల పండగే..
ఖేడ్ చరిత్రలోనే భారీ పోలింగ్
81.79 శాతం ఓటింగ్ నమోదు
ఫలించిన అభివృద్ధి మంత్రం
ఏకపక్షంగా సాగిన ఓటింగ్ సరళి
ఆకట్టుకున్న
మోడల్ పోలింగ్ కేంద్రాలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: నారాయణఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నికలో భారీ పోలింగ్ నమోదయింది. గతంలో ఎన్నడూ లేనంతగా 81.79 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో ఫ్యాక్షన్ తరహా రాజకీయాలు ఉండటంతో ఎన్నికల్లో ఘర్షణలు జరగవచ్చని అధికారులు అనుమానించారు. కానీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకపోవడంతో అధికారులు, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. సాధారణ ఎన్నికల్లో సెంటిమెంట్ మంత్రంతో అధికారంలోకి వచ్చిన గులాబీ పార్టీ.. నారాయణఖేడ్‌కు వచ్చే సరికి అభివృద్ధి తంత్రంతో సెంటుమెంటును పక్కకు నెట్టేసింది. ఓటింగ్ సరళిని చూసిన రాజకీయ పరిశీలకులు టీఆర్‌ఎస్ పార్టీకి భారీ మెజార్టీ దక్కుతుందని అంచనా వేస్తున్నారు. 168 రెవెన్యూ గ్రామాల్లోని 286 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం ఏడు గంటల నుంచి ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. 198 పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మొరాయించడంతో దాని స్థానంలో కొత్త దానిని ఏర్పాటు చేశారు. మనూరు మండలంలో ఔదత్‌పూర్‌లో కొంత ఆలస్యంగా ఓటింగ్ ప్రారంభమయింది.
పెద్దశంకరంపేట మండలంలో అత్యధికంగా 85.85 శాతం, నారాయణఖేడ్ 75, మనూరు మండలంలో 81, కల్హేర్ మండలంలో 84, కంగ్టి మండలంలో 80.76 శాతం పోలింగ్ నమోదు అయింది. 143 కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్.. సెల్‌ఫోన్ సిగ్నల్స్ అందుబాటులో ఉన్న 143 కేంద్రాల్లో ఎన్నికల అధికారులు లైవ్ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రోనాల్డ్‌రాస్ లైవ్ వెబ్‌కాస్టింగ్‌తోనే ఎన్నికల సరళిని పర్యవేక్షించారు. ఒక గ్రామంలో కాంట్రాక్టు పీఈటీ ఉద్యోగి ఎన్నికల ఏజెంటుగా కూర్చున్నారని ఫిర్యాదు రావడంతో వెబ్‌కాస్ట్‌లోనే అతని పరిశీలించి విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. జూకల్ పాలిటెక్నిక్ కాలేజ్‌లో ప్రత్యేక వెబ్ వీక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయడంతో పాటు, కలెక్టర్ వద్ద ఉన్న ట్యాబ్‌ద్వారా ఎన్నికల సరళి సమీక్షించారు. ఎన్నికలు ప్రశాంతంగా.. వేగం గా జరుగుతుండతో రోనాల్డ్‌రోస్ ఉత్సాహంగా కనిపించారు. అన్ని రాజకీయ పార్టీల నుంచి ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా ఆయన స్వీకరించారు. వారికి పరిష్కారం కూడా చూపెట్టి అన్ని పార్టీ అభ్యర్థుల మన్ననలు అందుకున్నారు.
దానికే ఓటు వేసిన..
‘రెండు పూటల సుశీల తింటున్నా.. సెడగొట్టుకుంటమా బిడ్డా... దానికే ఓటు వేసిన.. ’అని ఓ వృద్దురాలు సమాధానం. ఎన్నికల సర్వే చేస్తున్న వారికి ఇలాంటి సమాధానాలే వినిపించాయి. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో కలిపి 1.53 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో 75 శాతంపైగా ఓటర్లు ఒకే పార్టీ గుర్తుకు ఓటేసినట్లు సర్వేలు చెప్తున్నాయి. నిజానికి శతాబ్దకాలంగా నారాయణఖేడ్ ప్రజలకు అభివృద్ధి, ప్రభుత్వ సహకారం అంటే ఏమిటో తెలియదు. దివంగత ఎమ్మెల్యే కిష్టారెడ్డి మరణం తరువాత అధికార టీఆర్‌ఎస్ పార్టీ పక్కా ప్రణాళిక ప్రకారం అభివృద్ధి పనులు చేసుకుంటూ వెళ్లింది. ముఖ్యంగా రోడ్లు, మంచినీటి మీద దృష్టి పెట్టి ప్రగతిని చూపించింది. భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు దాదాపు ఐదు నెలలుగా నియోజకవర్గంలోనే తిరుగుతూ ప్రజల కష్టాలసుఖాలను నేరుగా విని తెలుసుకున్నారు. చిన్నచిన్న పనులను తక్షణమే పరిష్కరించడంతో వారికి స్వాంతన చేకూరింది. దీంతో ఓటర్లు అధికారపార్టీ వైపునకు మొగ్గు చూపారని రాజకీయ పరిశీలకుల విశ్లేషణ.
ఆకట్టుకున్న మోడల్ పోలింగ్ కేంద్రాలు
నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 20 మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మామిడి తోరణాలు కట్టి, టెంట్లు వేసి పెళ్లి మందిరిలా ముస్తాబు చేశారు. ఈ కేంద్రాల్లో ఓటర్‌కు రెడ్ కార్పెట్ పరిచి, పువ్వులతో ఆహ్వానం పలికారు. ఎండ తీవ్రత పెరిగిన మధ్యాహ్నం సమయంలో ఓటర్లకు మజ్జిగ, మంచినీళ్లు అందించారు. కల్హేర్ మండలం మాసాన్‌పల్లి మోడల్ కేంద్రం అధికారులను సైతం ఆకర్షించింది. ఇక్కడ పోలీసులు ఓటర్లతో అత్యంత మర్యాదగా మెలిగారు