
ఆ పల్లెలు..మచ్చతునకలు
రూ. కోట్లు కుమ్మరించినా..
- కదలిక లేని పనులు
- ప్రణాళికా లేదు.. పర్యవేక్షణా కరువు
- సమీక్షలతోనే అధికారుల టైంపాస్
- ఆ ఆరు గ్రామాల్లో ‘సాక్షి’ పర్యటన
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి; ‘పారిశుద్ధ్య లోపంపై యుద్ధం ప్రకటిద్దాం.. పల్లెలకు మౌలిక వసతులు కల్పిద్దాం. ఇక ఆసుపత్రుల్లో వైద్యం అందక ఎవరూ మరణించడానికి వీల్లేదు’.. గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధి మండలి (గడా) సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా అధికారులకు చేసిన సూచన ఇది. చెప్పినట్టే కేసీఆర్ నిధుల వరద పారించారు. రెండు దఫాలుగా ‘గడా’ అభివృద్ధికి రూ.25 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అప్పట్నుంచి ఆయన రూ.కోట్లు గుమ్మరిస్తూనే ఉన్నారు. అయితే, ఇదంతా నాణేనికి ఒకవైపు..
నాణేనికి మరోవైపు.. ఒకరిద్దరు కాదు.. అధికార యంత్రాంగమంతా ఉరుకులు పరుగులు పెడుతోంది. గజ్వేల్ చుట్టూనే తిరుగుతోంది. ‘గజ్వేల్ జనాల కాలికి ముళ్లు గుచ్చుకుంటే.. నా పంటితో దాన్ని పీకేస్తా’ అనేంతగా పోటీపడి ఆయా విభాగాల అధికారులు బిల్డప్ ఇస్తున్నారు. జిల్లా అంతా ఇది చూసి ‘అబ్బో.. అదృష్టమంటే గజ్వేల్ నియోజకవర్గ ప్రజలదే’ అనుకుంటున్నారు. జనాన్ని ఇలా భ్రమలో ముంచి పబ్బం గడిపేస్తున్న అధికారులు అంతలో.. ‘ఇక్కడి ఆరు పల్లెలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతాం. అవి బంగారు తెలంగాణకు ఆరు పిల్లర్లవంటివి. సీఎం కలలకు అవి ప్రతిరూపాలు. భవిష్యత్తు తెలంగాణకు మచ్చు తునకలు’ అంటూ కొత్త నాన్సెప్ట్ ప్రచారంలోకి తెచ్చారు. ఏడాది కిందటి సంగతి ఇది. ఇప్పుడు తాజాగా ‘సాక్షి’ ఆ ఆరు గ్రామాలకు వెళ్లింది. ఆ గ్రామాల పరిస్థితి ఎలా ఉందంటే..