విద్యాశాఖలో నిధుల వృథా! | Waste of funding in education department | Sakshi
Sakshi News home page

విద్యాశాఖలో నిధుల వృథా!

Published Sat, Jan 12 2019 1:51 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

Waste of funding in education department - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నెట్‌వర్క్‌ సమస్యలు, పనిచేయని మిషన్లతో పాఠశాల విద్యాశాఖలో బయోమెట్రిక్‌ హాజరు అమలుకు నోచుకోవడం లేదు. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో విద్యార్థులు, టీచర్ల బయోమెట్రిక్‌ హాజరుకు చర్యలు చేపట్టినా ఒక్క జిల్లాలో కూడా పక్కాగా అమలుకావడం లేదు. ఇందుకోసం రూ.10 కోట్లు వెచ్చించినా ప్రయోజనం లేకుండాపోయింది. నిర్వహణ సంస్థ వైఫల్యంతో ఆధార్‌ అనుసంధానిత బయోమెట్రిక్‌ హాజరువిధానం ఒక అడుగు ముందు కు నాలుగడుగులు వెనక్కు అన్నట్లుగా తయారైంది. ప్రస్తుత లోపాలను సవరించకుండానే రాష్ట్రంలోని మరిన్ని జిల్లాల్లో మరో రూ.20 కోట్లు వెచ్చించి బయోమెట్రిక్‌ హాజరు అమలుకు కసరత్తు చేస్తుండటంతో నిధులు వృథా అయ్యే పరిస్థితి నెలకొంది. 

పక్కా చర్యలు చేపట్టే ఉద్దేశంతో.. 
విద్యార్థులు, టీచర్ల హాజరుపై పక్కా లెక్కలు సేకరించే ఉద్దేశంతో విద్యాశాఖ 2016లో ఈ చర్యలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 27 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలుంటే అందులో 12 జిల్లాల్లోని దాదాపు 7 వేల పాఠశాలల్లో బయోమెట్రిక్‌ హాజరు అమలుకు చర్యలు చేపట్టింది. ఆ బాధ్యతలను తెలంగాణ స్టేట్‌ టెక్నాలజీ సర్వీసెస్‌కు అప్పగించింది. క్షేత్రస్థాయిలోని పాఠశాలల్లో బయోమెట్రిక్‌ పరికరాల ఏర్పాటు ఆధార్‌తో అనుసంధానం, నెట్‌వర్క్‌ లింక్‌ తదితర అన్ని పనులు పూర్తిచేసిన నిర్వహణ సంస్థ 2018 నుంచి అమల్లోకి తెచ్చింది. అయితే విద్యా సంవత్సరం ప్రారంభం నుంచీ అనేక సమస్యలు ఎదురయ్యాయి. నెట్‌వర్క్‌ సమస్యలతో హాజరు నమోదు కాకపోవడం, బయోమెట్రిక్‌ పరికరాలు పని చేయకపోవడం సమస్యలతో పాఠశాలల్లో వాటిని ఉపయోగించే వారే లేకుండాపోయారు. దీంతో రూ.10 కోట్లు వెచ్చించినా ప్రయోజనం లేకుండా పోయింది. 

చేతులెత్తేస్తున్న నిర్వహణ సంస్థ
బయోమెట్రిక్‌ హాజరుపై విద్యాశాఖ గతనెలలో సమీ క్షించింది. కమిషనర్‌ విజయ్‌కుమార్‌ నిర్వహణ సంస్థతో 3 గంటలపాటు సమావేశమై చర్చించారు. లోపాలను వారి దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదు. సమస్యలు పరిష్కారం కాలేదు. దీంతో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితుల్లో విద్యాశాఖ పడింది. మరిన్ని పాఠశాలల్లో దీన్ని విస్తరింపజేయాలని భావి స్తున్న సమయంలో తొలి విడతలో ఏర్పాటు చేసినవే పని చేయక గందరగోళంలో పడింది. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ఈనెల 3న ఏర్పాటుచేసిన బయోమెట్రిక్‌ హాజరు వివరాలను పరిశీలించింది. గతనెల 27వ తేదీ నాటి పరిస్థితితో పోల్చి చూస్తే.. పెద్దగా ప్రయోజనం కనిపించలేదు.

గత నెల 27న 1,165 స్కూళ్లనుంచి బయోమెట్రిక్‌ వివరాలు రాకపోగా ఈనెల 3న 908 స్కూళ్ల నుంచి వివరాలు రాలేదు. గతనెల 27న పాఠశాలకు హాజరైన 6,96,029 మంది విద్యార్థుల్లో 37,352 మంది విద్యార్థుల హాజరు మాత్రమే నమోదైంది. ఇక ఈనెల 3వ తేదీన మాత్రం 16 శాతం విద్యార్థుల బయోమెట్రిక్‌ హాజరు నమోదైంది. ఇక టీచర్ల హాజరు పరిస్థితి అలాగే ఉంది. గత నెల 27న టీచర్ల హాజరు 52 శాతమే నమోదైతే ఈనెల 3న 66 శాతం నమోదైంది. ఈ పరిస్థితుల్లో బయోమెట్రిక్‌ హాజరు విధానంపై ఎలా ముందుకు సాగాలన్న గందరగోళంలో విద్యాశాఖ పడింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement