నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం
‘సాక్షి’తో వైఎస్సార్‌సీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హామీల అమలు తీరును నాలుగైదు నెలలు పరిశీలించాలనే భావనతో ఉన్నాం
వైఎస్సార్ మాదిరిగా సంక్షేమం ఉండాలనుకుంటున్నాం
అసెంబ్లీలోనూ వాగ్దానాల అమలును కోరతాం
వలసలను ప్రోత్సహించడం మంచి పద్ధతి కాదని వ్యాఖ్య
హైదరాబాద్: తెలంగాణలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని... ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వైఎస్సార్ సీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలు, అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీల అమలుపై టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి మరో నాలుగైదు నెలల సమయమివ్వాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. వైఎస్సార్ మరణంతో మనోవేదన కు గురై తనువు చాలించిన వారి కుటుంబాలను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ప్రతినెలా ఒక జిల్లాలో దాదాపు వారంపాటు పర్యటించి పరామర్శిస్తారని తెలిపారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవలే వైఎస్సార్‌సీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు..
ప్రభుత్వ వైఫల్యాలపై మీ భావన ఏమిటి?
తెలంగాణలో విద్యుత్ కొరతకు కారణాలు ఏవైనప్పటికీ.. అదొక పెద్ద సమస్యగా మారింది. వ్యవసాయానికి ఏడు గంటలు విద్యుత్ ఇవ్వలేమనే వాస్తవాన్ని సీఎం కేసీఆర్ ప్రజలకు వివరిం చి ఉంటే బాగుండేది. కాంగ్రెస్ నేతలు చేస్తున్న రైతుల ఓదార్పు బోగస్. కాంగ్రెస్ హయాంలోని విధానాలు కూడా ప్రస్తుత పరిస్థితికి కారణం.
రాష్ట్రంలో సంక్షేమ పథకాలఅమలు ఎలా ఉంది?
దివంగత సీఎం రాజశేఖరరెడ్డి చేపట్టినట్లుగా సంక్షేమ పథకాలను అమలు చేయాలని మేం కోరుతున్నాం. వైఎస్ చేసిన అభివృద్ధి, బడుగు, బలహీనవర్గాలకు అందిన ప్రయోజనాల గురించి ఇప్పటికీ వారు గుర్తుచేసుకుంటున్నారు.
అసెంబ్లీలో ఎలాంటి వైఖరి అవలంబిస్తారు?
ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలైనా ఏ ఒక్క హామీని పూర్తిస్థాయిలో అమలు చేయలేదు. భూపంపిణీ తదతర పథకాలను లాంఛనంగా ప్రారంభించారే తప్ప.. అవి పూర్తి స్థాయిలో కొనసాగడం లేదు. దళితులతో పాటు గిరిజనులకు కూడా భూమి పంపిణీ చేయాలి. ఇలాంటి అంశాలన్నింటినీ ప్రాధాన్యతా క్రమంలో మా పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రస్తావిస్తారు.
ఎంపీగా రాష్ట్రం కోసం లోక్‌సభలో మీ పాత్ర?
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును, దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్ పాండ్‌ను జాతీయ ప్రాజెక్టులుగా ప్రకటించాలని లోక్‌సభలో గ ట్టిగా కోరాను. ఆ ప్రాజెక్టుల టెండర్లను రద్దుచేసి ముందుకు సాగకుండా చేస్తున్నారు. నాగార్జునసాగర్ కెనాల్‌కు ఫీడ్ చేసి ఖమ్మం, ఆపై ప్రాంతాలకు నీళ్లు ఇవ్వవచ్చు. ఈ విషయమై మంత్రి హరీశ్‌రావుతో మాట్లాడాను.
వలసల ప్రోత్సాహంపై ఏమంటారు?
వైరా ఎమ్మెల్యే మదన్‌లాల్‌ను టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. ఆయనపై అనర్హత వేటు ఖా యం. ఆ తర్వాత జరిగే ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కచ్చితంగా గెలిచి తీరుతారు. వలసలను ప్రోత్సహించే సంస్కృతి తప్పు.
పార్టీపరంగా భవిష్యత్ కార్యాచరణ?
శనివారం సాయంత్రం బాధ్యతలు స్వీకరిస్తాను. పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా జిల్లాల్లో పార్టీని పటిష్టానికి చర్యలు తీసుకుంటాం. రాష్ట్ర కమిటీలోని 11 మంది సభ్యులం సమావేశమై గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంపై చర్చిస్తాం.