ఆర్టీసీపై సీఎం కేసీఆర్‌ సంచలన నిర్ణయం | We Dont Discuss With RTC Employees Says CM KCR | Sakshi
Sakshi News home page

ఆర్టీసీపై సీఎం కేసీఆర్‌ సంచలన నిర్ణయం

Published Sun, Oct 6 2019 9:07 PM | Last Updated on Sun, Oct 6 2019 10:25 PM

We Dont Discuss With RTC Employees Says CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ చరిత్రలో ఒక నూతనాధ్యాయాన్ని ప్రారంభించబోతున్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు. ఇందులో భాగంగా ఆర్టీసీని లాభాల్లోకి తీసుకుపోవాలని, సంస్థ మనుగడ కొనసాగాలంటే కొన్ని చర్యలు తప్పవనీ సీఎం అన్నారు. సంవత్సరానికి రు.1200 కోట్ల నష్టంతో, రు. 5000 కోట్ల రుణభారంతో, క్రమబద్ధంగా పెరుగుతున్న డీజిల్ ధరలతో, ఇబ్బందుల్లో ఆర్టీసీ వున్న సమయంలో చట్ట విరుద్ధమైనదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పండుగల సీజన్లో సమ్మె దిగిన వారితో ఎలాంటి రాజీ సమస్యే లేదని, వారి చేసింది తీవ్రమైన తప్పిదమని సీఎం అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని, ఇక వారితో ఎలాంటి చర్చలు జరిపేది లేదని కేసీఆర్‌ స్పష్టం చేశారు. భవిష్యత్‌లో ఆర్టీసీకి సంబంధించి, ఎప్పటికీ క్రమ శిక్షణా రాహిత్యం, బ్లాక్ మెయిల్ విధానం, తలనొప్పి కలిగించే చర్యలు శాశ్వతంగా వుండకూడదని ప్రభుత్వం భావిస్తున్నదని ముఖ్యమంత్రి చెప్పారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఆదివారం రవాణ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం చేపట్టిన కేసీఆర్‌.. అనంతరం ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నట్లు సీఎం కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకునే ప్రసక్తేలేదు..
ప్రభుత్వం విధించిన గడువు లోపల విధుల్లోకి హాజరు కాని సిబ్బందిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకునే ప్రసక్తే లేదని, ఇక ఆర్టీసీలో మిగిలింది కేవలం 1200 మంది లోపే సిబ్బంది అని సీఎం అన్నారు. తక్షణ చర్యగా 2500 బస్సులను అద్దె పద్ధతిలో తీసుకుని నడపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 4114 ప్రయివేట్ బస్సులు ఇంకా వున్నాయి. వాటికి స్టేజ్ కారేజ్ గా చేస్తే వాళ్ళు కూడా ఆర్టీసీలోకి వస్తారు. ఈ విషయంలో వాళ్ళతో ఆర్టీసీ, రవాణా అధికారులు చర్చలు జరుపుతున్నారు. అతి కొద్ది రోజుల్లోనే కొత్త సిబ్బంది నియామకం చేపట్టాలని, నియామక ప్రక్రియ అతిత్వరగా చేపట్టాలని, కొత్తగా చేర్చుకునే సిబ్బంది యూనియన్లలో చేరమని ఒప్పంద పత్రం మీద సంతకం చేయాలని, కొత్త సిబ్బందిది షరతులతో కూడిన నియామకం అవుతుందని, ప్రొబేషన్ పీరియడ్ వుంటుందని ముఖ్యమంత్రి అన్నారు. ఏఏ కేటిగిరికి చెందిన సిబ్బంది సమ్మెకు పోయారో ఆయా కేటిగిరిలకు చెందిన సిబ్బందిని భర్తీ చేయడానికి నియామకం వుంటుందని ఆయన అన్నారు. ఆర్టీసీ నడపబోయే బస్సుల్లో సగం ప్రయివేట్ బస్సులుంటాయని, మిగతా సగం ఆర్టీసీ యాజమాన్యానివనీ నిర్ణయం జరిగింది. ఈ పద్ధతిలో చర్యలు చేపట్టితే బస్సులు బాగా నడుస్తాయి. రెండు-మూడేళ్ళలో సంస్థ నష్టాలను పూడ్చుకుని లాభాల్లోకి వస్తుంది అని సీఎం అన్నారు. మొత్తం 15 రోజుల్లో ఆర్టీసీ పూర్వస్థితికి రావాలని ముఖ్యమంత్రి అన్నారు.

ఈ విషయాలన్నీ కూలంకషంగా చర్చించి, ఒక నివేదిక సమర్పించడానికి రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కమిటీలో సభ్యులుగా రవాణా శాఖ కమీషనర్ సందీప్ సుల్తానియా, టీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమీషనర్ పాండురంగనాయకులున్నారు. వాళ్ళు తమ ప్రతిపాదనలను సోమవారం ప్రభుత్వానికి సమర్పిస్తారు. ఆర్టీసీ సమ్మె నేపధ్యంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపి మహేందర్ రెడ్డి, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్ నర్సింగ్ రావు, సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి, రవాణా శాఖ కమీషనర్ సందీప్ సుల్తానియా, అడిషనల్ డీజీపీ జితేంద్ర, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సమ్మెకు దిగడం అవసరమా?
“గత నలభై సంవత్సరాలుగా ఆర్టీసీ చుట్టూ అల్లుకున్న వ్యవహారం ఒక నిరంతర సమస్యాత్మకం. దీనికి ఒక శాశ్వత పరిష్కారం కనుగొనాలి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక అనేకరంగాలలో ముందుకు దూసుకుపోతున్నది. ఈ నేపధ్యంలో ఆర్టీసీ లాంటి సమస్యలు ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసే విధంగా మారాయి. ఇప్పుడు ఆర్టీసీ చేస్తున్న సమ్మె చట్ట వ్యతిరేకం, ఆలోచనా తప్పిదం, భాద్యతారాహిత్యం. ఇప్పుడు రాష్ట్రానికి ఈ విషయంలో శాశ్వతమైన లాభం చేకూరాలి. మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, చత్తీస్ ఘడ్, మణిపూర్ రాష్ట్రాలలో ఆర్టీసీ లేనే లేదు. బిహార్, ఒరిస్సా, జమ్మూ, కాశ్మీర్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ ఉత్తర్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో నామ మాత్రంగా వున్నాయి. ఆ విధంగా చూస్తె కర్నాటక తరువాత తెలంగాణలో అత్యధికంగా బస్సులు నడుస్తున్నాయి. ఇంత మంచిగా ఆర్టీసీని చూసుకుంటుంటే వారు సమ్మెకు దిగడం అవసరమా?” అని అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. 

ఆర్టీసీపై ప్రజలు చాలా కోపంగా వున్నారు
“భవిష్యత్ లొ ఆర్టీసిని ఏం చేయాలన్నా దృష్టిలో వుంచుకోవాల్సింది మొదలు ప్రజలను. ఆర్టీసీలో నైపుణ్యమైన, వృత్తిపరమైన యాజమాన్యం వుంది. అన్ని విధాలా స్థిరత్వం సాధించుకునే వీలుంది. మనం ఏదైనా నిర్ణయం తీసుకునే ముందర సమతుల్యం పాటించాలి. ఒక పక్క ప్రయివేట్ భాగస్వామ్యం, మరొక పక్క ఆర్టీసీ యాజమాన్యం వుంటేనే మంచిది. ప్రజలు సమ్మెకు దిగిన ఆర్టీసీ సిబ్బంది మీద చాలా కోపంగా వున్నారు. సోషల్ మీడియాలో కూడా వ్యతిరేకత వస్తున్నది. సమ్మె ద్వారా ప్రజలకు ఎంతో అసౌకర్యం కలిగింది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడా విధులకు హాజరవని వారిని తిరిగి విధుల్లోకి తీసుకోము. గడపదాటితే బయటికే.. మళ్లీ గడపలోకి వచ్చే సమస్యే లేదు. విలీనం గురించి అఖిల పక్ష సమావేశం జరపాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. వారికి ఆర్టీసీ విషయంలో మాట్లాడే హక్కులేదు. సీపీఎం అధికారంలో వున్నా, నాడు, పశ్చిమ బెంగాల్ లొ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసారా? కేరళలో చేసారా? బీజేపీ ఎన్నో రాష్ట్రాలలో అధికారంలో వుంది కాని ఎక్కడైనా విలీనం చేసారా? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఏ రాష్ట్రంలోనైనా చేశాయా? అందుకే వాళ్లకు అడిగే హక్కు లేదు. అఖిల పక్ష సమావేశం డిమాండ్ అసంబద్ధం. తెలంగాణ  ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అందరి కళ్ళూ తెరిపించాలి”. అని అన్నారు సీఎం కేసీఆర్.

బ్లాక్ మెయిల్ రాజకీయాలకు ప్రభుత్వం తలవంచదు
“ఆర్టీసీ తప్పకుండా లాభాల్లోకి రావాలి. దాన్ని లాభాల్లో నడిచే సంస్థగా రూపు దిద్దాలి. ఏదేమైనా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ కలగకూడదు. ఆర్టీసీ చేస్తున్న ఏర్పాట్లతో పాటు, రాష్ట్రంలో 1, 22, 58, 433 వివిధ రకాల ప్రయివేట్ వాహనాలున్నాయి. ఇవన్నీ ప్రజల రవాణాకు ఉపయోగ పడేవే. వారి రవాణా ఇబ్బందులు కొంతవరకు తొలగించేవే. ఆర్టీసీలో వున్న యాజమాన్య నైపుణ్యాన్ని చక్కగా వాడుకోవాలి. ఆర్టీసీ కార్గో సర్వీస్ ద్వారా కూడా లాభాలు రాబట్టాలి. ఈ పోటీ ప్రపంచంలో వినూత్నంగా ఆలోచించి సంస్థను లాభాల్లోకి తీసుకురావాలి. అనేక రంగాలలో ముందున్న తెలంగాణ రాష్ట్రం ఆర్టీసీ విషయంలో కూడా ముందుండాలి. దానికి అవసరమైనదంతా చేయాలి. నాకు అన్నింటికన్నా అత్యంత ప్రాదాన్యమయింది తెలంగాణ గొప్ప రాష్ట్రంగా తయారు కావడమే. యావన్మంది ప్రజల క్షేమమే నా ధ్యేయం. ఒక అద్భుతమైన, గొప్పదైన, సమర్ధమైన లాభాలబాటలో నడిచే సంస్థగా ఆర్ట్టీసీ రూపుదిద్దుకోవాలి. హైదరాబాద్ నగరానికి చెందినంతవరకు నష్టాలను ప్రభుత్వం భరిస్తుంది. ప్రస్తుతం 10400 బస్సులలో సుమారు కోటి మంది ప్రయాణం చేస్తున్నారు. భవిష్యత్ లో కూడా ఆ సౌకర్యం కొనసాగుతుంది. సగటున ఆర్టీసీ సిబ్బందికి నెలకు రు. 50,000 జీతం వస్తున్నా ఇంకా పెంచమని అడగడంలో అర్థం లేదు. ఈ యూనియన్ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు ప్రభుత్వం తల వంచదు” అని ముఖ్యమంత్రి అన్నారు . 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement