విద్యారంగాన్ని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వ ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోందని పరిశ్రమల శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు
కొల్లాపూర్ : విద్యారంగాన్ని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వ ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోందని పరిశ్రమల శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కోసం శిక్షణనిచ్చేందుకు కొల్లాపూర్‌లో ఏర్పాటు చేసిన స్టడీ సర్కిల్‌ను శుక్రవారం మంత్రి జూపల్లి లాంఛనంగా ప్రారంభించారు. కన్యకా పరమేశ్వరి మంటపంలో కలెక్టర్ శ్రీదేవి సమక్షంలో ఏర్పాటుచేసిన సభలో మంత్రి నిరుద్యోగ యువతీ, యువకులనుద్ధేశించి మాట్లాడారు. యువతీ, యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయాలనే ఉద్ధేశ్యంతో స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ కేంద్రంలో ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షల కోసం ఉచితంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తారని, కొల్లాపూర్ నియోజకవర్గంలో వంద శాతం అక్షరాస్యత సాధించేందుకు ప్రతిఒక్కరూ కృషిచేయాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి నియోజకవర్గంలోని పాఠశాలలు, వసతి గృహాల్లో కూడా స్టడీ అవర్స్ ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. అనంతరం కలెక్టర్ శ్రీదేవి మాట్లాడారు. సేవా సంస్థలు, ఆర్థిక సహకారం అందించే వారు ముందుకు వస్తే జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఇటువంటి శిక్షణ తరగతులు ఏర్పాటు చేయించేందుకు ప్రయత్నం చేస్తానన్నారు. సమావేశంలో రిటైర్డ్ డీఆర్వో మదన్‌మోహన్‌రావు, స్టడీ సర్కిల్ డెరైక్టర్లు జగదీశ్వర్‌రెడ్డి, వాల మదన్‌మోహన్‌రావు, ఇన్‌చార్జి అర్జున్‌గౌడ్, ఎంపీపీ నిరంజన్‌రావు, జెడ్పీటీసీ హన్మం తు, రఘుపతిరావు, తదితరులున్నారు.