నిజామాబాద్ అర్బన్: దీపావళి వచ్చిందంటే వారికి పండుగే. వ్యాపారంపై వున్న దృష్టి ప్రమాదం జరిగితే ఎలా అన్నదానిపై మాత్రం ఉండదు. వీరికి అధికారుల నిర్లక్ష్య వైఖరి తోడైంది. దీంతో విచ్చలవిడిగా పటాకుల కేంద్రాలు వెలుస్తున్నాయి. అధికారుల తీరు వ్యాపారులకు కాసులు పండిస్తోంది. నగరంలోని కిషన్‌గంజ్ నిత్యం జనంతో కిటకిటలాడుతూ ఉంటుంది. కనీసం మోటారు సైకిళ్లు కూడా సక్రమంగా వెళ్లే పరిస్థితి లేదు. ఇదే ప్రాంతంలో ఇరుకు గదులలో పటాకుల వ్యాపారం కొనసాగుతోంది. దాదాపు పది మంది హోల్‌సేల్ వ్యాపారులు వీటిని ఏర్పాటు చేశారు.
ఇక్కడి నుంచే జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు టపాసులు సరఫరా అవుతాయి. ఇంత పెద్ద మొత్తంలో ఇక్కడ వ్యాపారం జరుగుతుంటే, కనీస నిబంధనలు మాత్రం అమలు కావడం లేదు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఏదైనా ప్రమాదం జరిగితే అందుకు బాధ్యులెవరు? అక్కడికి కనీసం అగ్నిమాపక శకటం కూడా వెళ్లలేని పరిస్థితి. కోట్ల రూపాయల విలువ చేసే వ్యాపార సమూదాయాలూ అక్కడే ఉన్నాయి. మరి కొన్ని పటాకుల దుకాణా లను నివాస గృహాలలోనే ఏర్పాటు చేస్తున్నారు. అధికారులు లెసైన్సుల జారీ చేస్తూ అందినంతా ముడుపులు అందుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్
పటాకుల విక్రయ కేంద్రాలు నిర్ణీత ప్రదేశాలలోనే కొనసాగేలా చూడాలని, నిబంధనలు ఉల్లంఘించినవారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రొనాల్డ్ రోస్ గత శుక్రవారం జరిగిన సమీక్ష సమావేశంలో అధికారులను ఆదే శించారు. అధికారులు మాత్రం ఆయన ఆదేశాలను తుంగలో తొక్కారు. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న విక్రయ కే్రందాలకు నేటి వరకూ వెళ్లలేదు. విక్రయాల కోసం నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, ఆర్మూర్, బాన్సువాడ, డిచ్‌పల్లిని ఎంపిక చేశారు.
ఈ ప్రాంతాలలో జారీ చేసిన లెసైన్సుల సంఖ్య రెండంకెలు కూడా దాటలేదు. ప్రజలు తిరగాడే ప్రాంతాలలో పటాకుల అమ్మకాలు ఉండకూడదని, దుకాణానికీ, దుకాణానికీ మధ్య కనీసం మూడు మీటర్ల దూరం పాటించాలన్న కలెక్టర్ ఆదేశాలను ఎవ్వరూ పాటించడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నిబంధనలు అమలయ్యేలా చూడాలని పలువురు కోరుతున్నారు.
ప్రమాదం జరిగితే బాధ్యులెవరు?
Published Mon, Oct 20 2014 3:25 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
Advertisement
Advertisement