పవన్ కళ్యాణ్ ఎందుకు కనిపించలేదు?
మెదక్ : ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో బీజేపీ తరపున తెగ హడావుడి చేసిన పవన్ కళ్యాణ్ మెదక్ ఉప ఎన్నికల ప్రచారంలో మాత్రం కనిపించలేదు. గురువారంతో మెదక్ ఉప ఎన్నికల ప్రచార పోరు ముగియనుంది. మరి కొన్ని గంటల్లో ప్రచారం ముగియనున్నా పవన్ మాత్రం ప్రచారానికి దూరంగా ఉన్నారు. జనసేన ఆవిర్భావం సందర్భంగా జాగ్గారెడ్డిపై పొగడ్తల వర్షం కురిపించిన పవన్ ..... ఈమధ్య కాలంలో అతనికి దూరంగానే ఉన్నాడు. అయితే పవన్కు సర్జరీ చేయించుకోవటం వల్లే ఎవరికీ అందుబాటులో లేనట్లు సమాచారం.
ఇక సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరపున పవన్ ప్రచార బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అలాంటిది ప్రియ మిత్రుడు జగ్గారెడ్డి బరిలో ఉన్నా పవన్ ఎందుకు సపోర్టు చేయడం లేదు? పవన్ సూచన మేరకే జగ్గారెడ్డి బీజేపీలో చేరి పోటీకి దిగారనే ప్రచారంలో వాస్తవమెంత? జగ్గారెడ్డిని బీజేపీ తమ అభ్యర్థిగా ప్రకటించగానే మెదక్ ఓటర్లు చాలా మంది పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారని భావించారు.
మెదక్ ఉపఎన్నికను పవన్ సీరియస్‌గా తీసుకోకపోవడానికి కారణమేంటో రాజకీయ విశ్లేషకులు ఊహించలేకపోతున్నారు. టీఆర్ఎస్ బలంగా ఉండటం, మెదక్‌లో గులాబీ దళం వరుసగా మూడుసార్లు విజయం సాధించిన కారణంగా పవన్ ప్రచారానికి దూరంగా ఉన్నారని అంతా భావిస్తున్నారు. ఒకవేళ జగ్గారెడ్డి తరపున ప్రచారం చేసి ఉంటే దాని ప్రభావం కచ్చితంగా ఎన్నికలపై ఉండేదని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ ప్రచారం లేకుండానే మెదక్ ఉపఎన్నిక ప్రచారం ముగుస్తోంది.