సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లాలో చలితీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలితీవ్రతకు సామాన్యులు గజగజ వణుకుతున్నారు. మధ్యాహ్నం వేళ చల్లగాలులు వీస్తున్నాయి. జిల్లాలోని గద్వాల, అలంపూర్ ప్రాంతాల్లో అతితక్కువగా 11, 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, ఆదివారం సరాసరిగా 13 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయింది. ఇదిలాఉండగా, మూడురోజుల క్రితం జిల్లాలోని ఎదిరలో అతితక్కువగా నమోదైన 7డిగ్రీల ఉష్ణోగ్రతను పరిశీలిస్తే చలితీవ్రత అర్థమవుతోంది.
ఇప్పటివరకు జిల్లాలో గతేడాది డిసెంబర్‌లో అతి తక్కువగా 13.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అయితే ఈ సారి మాత్రం సింగిల్‌డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలిగాలుల తీవ్రతకు వృద్ధులు, చిన్నారులు తట్టుకోలేకపోతున్నారు. వీటికితోడు పొద్దస్తమానం చల్లగాలులు వీస్తుండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం వేళ పొగమంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంతటి తీవ్రస్థాయిలో చలిని గతంలో ఎన్నడూ చూడలేదని జిల్లా వాసులు పేర్కొంటున్నారు.
ఆజ్యం పోస్తున్న అల్పపీడనం..
జిల్లాలో వారం రోజులుగా అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత ఆజ్యం పోస్తుంది. రెండు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలో చలిగాలులు విజృంభిస్తున్నాయి. దీంతో చలితీవ్రత మరింత పెరిగింది.
జాగ్రత్తలు తీసుకుంటేనే మేలు
గద్వాలటౌన్: చలికాలంలో చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలి. రోగనిరోధకశక్తి తక్కువగా ఉంటుంది కావునా వాతావరణ మార్పుల కారణంగా త్వరగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. అందువల్ల ఉదయం, సాయంత్రం వారిని బయటతిరగనీయొద్దు. గ్రామాల నుంచి పట్టణాల్లోని పాఠశాలలకు ఉదయం సమయాల్లో బస్సులు, ఆటోల్లో వెళ్లే విద్యార్థులకు విధిగా స్వెటర్లు, మంకీ క్యాప్‌లు ధరించాలి. పిల్లలకు ఎక్కువగా జలుబు చేస్తే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు.
మంచు కురిసేవేళ..
తెల్లవారుజామున పొగమంచు కురుస్తుంది. ఒక్కసారి మంచు చాలా దట్టంగా కురిసి దారి కనిపించకుండా పోతోంది. దీనివల్ల ముందుగా వచ్చే వాహనాలు దగ్గరకు వచ్చేవరకు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వాహనాలు నడిపేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. లైట్లు వేసుకోవడంతో పాటు తక్కువ వేగంతో వాహనాలు నడపాలి. చలికాలం మామూలుగా ఉంటేనే చలితో వణికిపోతాం. అలాంటిది వాహనాలపై ప్రయాణిస్తే వణుకు పుడుతుంది. ఉదయం, సాయంత్రం సమయాల్లో ముఖ్యంగా ద్విచక్రవాహనాలపై ప్రయాణించాల్సి వస్తే వెచ్చగా ఉండే జర్కిన్, తలకు, చెవులకు రక్షణగా మంకీక్యాప్, చేతులకు గ్లౌస్‌లు వేసుకోవాలి.
జిల్లాలో చలితీవ్రత
Published Mon, Dec 29 2014 1:50 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement