పల్లెల అభివృద్ధికి కృషిచేస్తా: జూపల్లి
సాక్షి, హైదరాబాద్: ఇప్పటి వరకు పరిశ్రమల శాఖ మంత్రిగా రాష్ట్రానికి పరిశ్రమలు తెచ్చేందుకు కృషి చేశానని, ఇకపై పల్లెలను అభివృద్ధి చేసేందుకు శక్తి వంచన లేకుండా పనిచేస్తానని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కొత్త బాధ్యతలు అప్పగించినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపా రు. శాఖకు చెందిన ఉన్నతాధికారులు, ఉద్యోగులు మంగళవారం సచివాలయంలో జూపల్లిని కలసి శుభాకాంక్షలు తెలిపారు.
గ్రామీణ ప్రాంత ప్రజలను, ప్రజాప్రతినిధులను కలుపుకుపోతానని, పరిపాలనలో కొత్త ఒరవడితో ముందుకు వెళతానని జూపల్లి చెప్పారు. స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయడంలో భాగంగా మహిళలు చదువు నేర్చుకునేలా కృషి చేస్తానన్నారు. గ్రామీణ పేదలకు వందశాతం ఉపాధి పనులు అందేలా చూస్తానన్నారు. మంత్రికి శుభాకాంక్షలు తెలిపిన వారిలో పంచాయతీరాజ్ విభాగం డెరైక్టర్ అనితారాం చంద్రన్, ఇంజనీర్ ఇన్ చీఫ్ సత్యనారాయణరెడ్డి, ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు భూమన్న తదితరులున్నారు.