వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం ప్రకటించిన రాష్ర్ట కమిటీలో మహబూబ్‌నగర్ జిల్లా నేతలకు చోటు దక్కింది.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం ప్రకటించిన రాష్ర్ట కమిటీలో మహబూబ్‌నగర్ జిల్లా నేతలకు చోటు దక్కింది. మాజీ ఎమ్మెల్యే, పార్టీ రైతు విభాగం రాష్ర్ట అధ్యక్షుడు ఎడ్మ కిష్టారెడ్డిని పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. నాగర్‌కర్నూలుకు చెందిన మాదిరెడ్డి భగవంతురెడ్డి రాష్ట్ర కార్యదర్శిగా, కోస్గికి చెందిన గందె హన్మంతు రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమితులయ్యారు. పార్టీ జిల్లా పరిశీలకులుగా గున్నం నాగిరెడ్డి, సహ పరిశీలకులుగా కె.సుదీప్‌రెడ్డి, వేముల శేఖర్‌రెడ్డి వ్యవహరిస్తారు. కాగా ఎడ్మ కిష్టారెడ్డి నల్లగొండ, భగవంతురెడ్డి ఆదిలాబాద్ జిల్లాల పరిశీలకుగా వ్యవహరిస్తారు.
గత నెల తొమ్మిదిన ప్రకటించిన రాష్ట్ర కార్యవర్గ జాబితాలో ఎడ్మ కిష్టారెడ్డి రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. రాష్ట్ర కార్యవర్గంలో స్వల్ప మార్పు చేస్తూ కిష్టారెడ్డికి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. గతంలో ప్రకటించిన రాష్ట్ర కమిటీలో భీష్వ రవీందర్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా, రాంభూపాల్‌రెడ్డి, భీమయ్యగౌడ్, లక్ష్మణ్ రాష్ట్ర కార్యవర్గంలో నియమితులయ్యారు. జిల్లా నేతలకు పార్టీ రాష్ట్ర కమిటీలో పెద్ద పీట వేయడంపై వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మామిడి శ్యాంసుందర్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్, తెలంగాణ కమిటీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు జిల్లా నేతల సహకారంతో పార్టీని మరింత బ లోపేతం చేస్తామన్నారు.
పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తా : భగవంతరెడ్డి
నాగర్‌కర్నూల్: పార్టీ అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తానని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి మాదిరెడ్డి భగవంతరెడ్డి అన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన అనంతరం శుక్రవారం ‘సాక్షి’తో ఆయన మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్ఫూర్తితో పార్టీ బలోపేతానికి కృషిచేస్తానని చెప్పారు. పార్టీ ఇచ్చిన ఆదేశాలు పాటిస్తూ నియోజకవర్గంలో వైఎస్‌ఆర్‌సీపీని ముందుకు తీసుకెళ్తానని అన్నారు. తనకు అప్పగించిన ఈ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ రైతులకు, నిరుపేదల కోసం వైఎస్‌ఆర్‌సీపీ తరఫున నియోజకవర్గంలో పోరాటాలు నిర్వహిస్తానన్నారు. గ్రామగ్రామాన నియోజకవర్గంలో పార్టీ బలోపేతం చేయటమే లక్ష్యమని వివరించారు. ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడేవి అయితే మద్దతిస్తామని, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామన్నారు.
అధిష్టానానికి కృతజ్ఞతలు
కోస్గి: వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమించినందుకు కోస్గి పట్టణానికి చెందిన గందె హన్మంతు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ పార్టీ కమిటీలో కొడంగల్ నియోజకవర్గానికి ప్రాధాన్యం ఇస్తూ తనకు పార్టీ పదవి ఇచ్చారని.. తనకు పదవి రావడానికి సహకరించిన నాయకులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు చెప్పారు.