
సాక్షి, నిజామాబాద్: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌కు, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందని జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు అన్నారు. మంగళవారం ఆయన ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. కాళేశ్వరంతో కోటి ఎకరాల మాగాణికి నీరందించటం దేశ ద్రోహమవుతుందా? అని ప్రశ్నించారు. ‘మాజీ ఎంపీ కవిత మీద కామెంట్ చేశారు.. ఆమె చేసిన అభివృద్ధి మీకు కనిపించలేదా’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘ఖబడ్దార్ నోరు అదుపులో పెట్టుకో అరవింద్..’ అంటూ విఠల్‌రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ జాతీయ నాయకులు సీఎం కేసీఆర్, కేటీఆర్, కవితను మెచ్చుకున్న సందర్భాలున్నాయని గుర్తు చేశారు. ఎంపీ ధర్మపురి అరవింద్ టీఆర్‌ఎస్ రథసారథులు కేసీఆర్, కేటీఆర్‌లను విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పసుపు బోర్డు తీసుకొస్తానని మాయమాటలు చెప్పి బీజేపీ రైతులను మోసం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలోని రైతులకు యూరియా దొరకటం లేదని, దమ్ముంటే కేంద్రానికి చెప్పి యూరియా తెప్పించమని సవాలు విసిరారు.