ఎన్నికకు వేళాయే!
సంగారెడ్డి డివిజన్: జెడ్పీ, మున్సిపల్ చైర్మన్ ఎన్నిక షెడ్యూల్ త్వరలో విడుదల కానున్నట్టు తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా పాలక వర్గాలు కొలువుదీరనున్నట్టు సమాచారం. మూడు లేదా నాలుగో వారంలో ఎన్నికల కమిషన్ జెడ్పీ, మున్సిపల్ చైర్‌పర్సన్లతోపాటు మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేస్తారని అందరూ భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. మున్సిపల్ కౌన్సిలర్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు ఎన్నికై నెల రోజులు కావస్తున్నా ఇంకా కొత్త పాలకవర్గాలు కొలువుదీరలేదు.
దీంతో కౌన్సిలర్లు, జెడ్పీటీసీలుగా ఎన్నికైన ప్రజాప్రతినిధుల్లో అసంతృప్తి నెలకొంది. మున్సిపల్ చైర్మన్, ఎంపీపీ పదవులపై ఆశలు పెట్టుకుని క్యాంపులు నడుపుతున్న వారికి క్యాంపుల నిర్వహణ భారంగా మారుతున్నాయి. మరోవైపు షెడ్యూల్ జాప్యంతో క్యాంపులో తమకు మద్దతుగా ఉన్న కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు ఎక్కడ జారిపోతారోనన్న ఆందోళనతో ఉన్నారు. ఈ నెల 25 తర్వాత షెడ్యూల్ విడుదల చేసి నెలాఖరు వరకు కొత్త పాలకవర్గాలు కొలువుదీరేలా చూడాలని ఎన్నికల కమిషన్ యోచిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే మెజార్టీ జెడ్పీటీసీ సభ్యులు టీఆర్‌ఎస్‌కు ఉన్నందునా జెడ్పీ పీఠం ఆ పార్టీకే దక్కే అవకాశాలున్నాయి. జిల్లాలోని మెజార్టీ ఎంపీపీ పదవులను దక్కించుకునేందుకు టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటీపడుతున్నాయి. ఇందుకోసం పోటాపోటీగా క్యాంపులు నడుపుతున్నాయి.
మున్సిపాలిటీల్లో మారుతున్న సమీకరణాలు
జిల్లాలో మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో సమీకరణాలు మారుతున్నాయి. సంగారెడ్డి, సదాశివపేట, మెదక్, జహీరాబాద్ మున్సిపాలిటీలతోపాటు జోగిపేట, గజ్వేల్ నగరపంచాయతీలకు చైర్మన్ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆయా చోట్ల పాగా వేసేందుకు టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పావులు కదుపుతున్నాయి. మెదక్ మున్సిపాలిటీ మినహా టీఆర్‌ఎస్‌కు మిగతా మున్సిపాలిటీల్లో చైర్మన్ పదవులు దక్కించుకునేందుకు అవసరమైన సంఖ్యాబలం లేదు. అయితే టీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నందున తమతో కలిసివచ్చే కౌన్సిలర్లను కలుపుకుని చైర్మన్ పదవులను కైవసం చేసుకోవాలని ఆ పార్టీ యోచిస్తోంది.
సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌కు అధిక మెజార్టీ ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ క్యాంపులు నిర్వహిస్తూ ఎలాగైనా చైర్మన్ పదవులు సొంతం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. అయితే సంగారెడ్డిలో ఎంఐఎం, స్వతంత్ర కౌన్సిలర్ల మద్దతుతో, అలాగే సదాశివపేటలోనూ చైర్మన్ పదవులను కైవసం చేసుకోవాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. జహీరాబాద్ మున్సిపాలిటీల్లో 24 స్థానాలకు కాంగ్రెస్ 12 కౌన్సిలర్ స్థానాలను గెలుపొందింది. చైర్మన్ పదవి పొందాలంటే మరొక్క కౌన్సిలర్ అవసరం.
అయితే ఎమ్మెల్యే గీతారెడ్డి ఎక్స్‌అఫీషియో హోదాలో ఓటు వేసే అవకాశం ఉన్నందునా కాంగ్రెస్‌కు చైర్మన్ పదవి దక్కేఅవకాశం ఉంది. అయితే టీఆర్‌ఎస్ పార్టీ టీడీపీ, ఎంఐఎం, స్వతంత్ర అభ్యర్థులు కలిస్తే వారి సంఖ్య 12 అవుతుంది. టీఆర్‌ఎస్ ఎంపీ బీబీ పాటిల్ ఎక్స్‌అఫీషియో హోదాలో చైర్మన్ ఎన్నికలో ఓటు వేసే అవకాశం ఉంది. దీంతో జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రసకందాయంలో పడింది. గజ్వేల్ నగరపంచాయతీలో టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ కౌన్సిలర్లు మద్దతు పలకడంతో ఇక్కడ చైర్మన్ పదవి దక్కించుకోవటం అధికార పార్టీకి నల్లేరుమీద నడకలా మారింది. జోగిపేట నగరపంచాయతీలో కాంగ్రెస్‌కు సంపూర్ణ మెజార్టీ ఉన్నందున చైర్మన్ పదవి దక్కే అవకాశాలున్నాయి.
కీలకంగా మారనున్న ‘విప్’
మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో విప్ కీలకంగా మారనుంది. దీంతో ఇతర పార్టీల్లోకి జంప్ చేయాలన్న కౌన్సిలర్లకు విప్ భయం పట్టుకుంది. మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో లోపాయికారిగా అధికార పార్టీకి సహకరించాలని అనుకుంటున్న కాంగ్రెస్, టీడీపీ, ఇతర పార్టీ కౌన్సిలర్లకు విప్ అడ్డంకిగామారుతోంది. కాంగ్రెస్ పార్టీ విప్‌ను అస్త్రంగా వినియోగించుకోవాలని చూస్తోంది. అయితే విప్ జారీ చేసే అధికారం ఎమ్మెల్యేలకు కట్టబెట్టాలా, డీసీసీ అధ్యక్షునికి ఇవ్వాలా అనే అంశంపై కాంగ్రెస్ అధిష్టానం మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్ పార్టీ మాత్రం జిల్లా అధ్యక్షులకు విప్ అధికారం కట్టబెట్టాలని యోచిస్తోంది. ఇదిలా ఉంటే కొన్ని మున్సిపాలిటీల్లో కీలకంగా ఉన్న ఎంఐఎం పార్టీకి విప్ జారీ చేసే అవకాశం లేదని తెలుస్తోంది.