హైవేలపై కొత్తగా 1,710 పోలీస్ స్టేషన్లు
* ఏర్పాటు కోసం ప్రభుత్వానికి పోలీస్ శాఖ ప్రతిపాదనలు
* రహదారులపై ప్రమాదాలను అరికట్టేందుకు కసరత్తు
సాక్షి, హైదరాబాద్: నిత్యం ఎక్కడో ఒకచోట రహదారులు నెత్తురోడుతున్నాయి. ప్రమాదాల కారణంగా ఏటా వేలాదిమంది ప్రాణాలు పోగొట్టుకుంటుంటే.. మరికొందరు క్షతగాత్రులుగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో రస్తసిక్తమవుతున్న రహదారులపై ప్రమాదాల నివారణకు రాష్ట్ర పోలీసు శాఖ నడుం బిగించింది. అన్ని ప్రధాన రహదారులపై పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసి వేగ నియంత్రణ చేయాలని సంకల్పించింది.
స్పీడ్‌గన్‌లతో వాహనాల జోరుకు కళ్లెం వేయాలని భావిస్తోంది. అందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన రహదారులపై 1,710 పోలీస్ స్టేషన్ల ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. సర్కారు నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే త్వరితగతిన వీటిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది.
ఏటా పెరుగుతున్న ప్రమాదాలు!
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రహదారుల భద్రతకు పెద్ద పీట వేయాలని డీజీపీ అనురాగ్‌శర్మ భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 16 జాతీయ రహదారులు, 42 రాష్ట్రీయ రహదారులు ఉన్నాయి. ఈ రెండు రకాల రహదారులు కలుపుకొని 26,837 కి.మీ. విస్తీర్ణం ఉన్నాయి. వీటి పరిధిలో 2014లో 17,330 ప్రమాదాలు జరిగి 6,259 మంది ప్రాణాలు కోల్పోగా.. 19,241 మంది గాయాలపాలయ్యారు. 2015లోనూ 18,534 ప్రమాదాలు చోటు చేసుకోగా... 6,495 మంది మృత్యువాత పడ్డారు. 20,922 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. గతేడాదితో పోల్చితే ప్రమాదాలు.. మృతుల సంఖ్య పెరిగింది.
భారీగా చలాన్లు విధించేందుకు కసరత్తు
ప్రమాదాలను అరికట్టేందుకు నిబంధనలను అతిక్రమించేవారికి భారీగా జరిమానాలు విధించాలని పోలీసు శాఖ నిర్ణయించింది. 2015లో పోలీసులు 20 లక్షల కేసులు పెట్టి రూ. 35 కోట్లకు పైగా జరిమానాలు విధించారు. ఇక నుంచి హైవేలపై కూడా వాహనాలకు జరిమానా విధించేందుకు కసరత్తు చేస్తున్నారు.