అధికార పార్టీ నుంచి 33 మంది ఎమ్మెల్యేలు జంప్
ఈటానగర్: అరుణాచల్ ప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఇప్పటి వరకు అధికారంలో ఉన్న పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ (పీపీఏ)కు భారీ షాక్ తగిలింది. శనివారం ఆ పార్టీకి చెందిన 33 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగురవేసి బీజేపీలో చేరారు. దీంతో 60 మంది సభ్యులున్న ఆ రాష్ట్ర అసెంబ్లీలో పీపీఏకు 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు.
అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూతో పాటు మరో ఆరుగురు ఎమ్మెల్యేలపై పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్‌ప్రదేశ్(పీపీఏ) వేటు వేయడంతో రాజకీయ సంక్షోభం ఏర్పడిన సంగతి తెలిసిందే. నాయకత్వ మార్పు తప్పదని పీపీఏ వెల్లడించింది. అయితే ఖండూ చెప్పినట్టుగా ఆయన మద్దతుదారులు తిరుగుబాటు చేయడంతో పీపీఏకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఖండూ సహా 33 మంది ఎమ్మెల్యేలు బీజేపీ గూటికి చేరారు. బీజేపీ ఖండూకే తమ మద్దతు ప్రకటించింది. బీజేపీకి 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో ఖండూకు అసెంబ్లీలో పూర్తి మెజార్టీ లభించినట్టయ్యింది.