కరాచీ : పాకిస్థాన్లోని కరాచీ నగరంలో శుక్రవారం అర్థరాత్రి టాస్క్ఫోర్స్ పోలీసులకు... గ్యాంగ్స్టర్స్కు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఐదుగురు గ్యాంగ్స్టర్స్ మరణించారని సీనియర్ పోలీస్ ఉన్నతాధికారి ఫిదా హుస్సేన్ జన్వారీ శనివారం వెల్లడించారు. ఈ ఎన్కౌంటర్లో నేప్యర్ పోలీసు స్టేషన్ హౌస్ ఉన్నతాధికారి అజాంఖాన్ తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు.
కరాచీ నగరం లైరీ సమీపంలోని మార్కెట్ వద్ద గ్యాంగ్స్టర్స్ ఉన్నారని నిఘా వర్గాల సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు సదరు ప్రదేశానికి చేరుకున్నారు. ఆ విషయం గమనించిన గ్యాంగ్స్టర్స్... పోలీసులపైకి ముకుమ్మడిగా కాల్పులకు దిగారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులకు దిగారని ఫిదా హుస్సేన్ జన్వారీ వెల్లడించారు.