జైపూర్:గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఓ ఇంటి గోడ కూలి ఏడుగురు మృతి చెందిన ఘటన బరాన్ జిల్లాలోని కల్మాండ్ గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఆ వర్షాలకు ఇంట్లోకి నీళ్లు రావడంతో గోడ కూలిపోవడంతో ఈ దుర్ఘటన సంభవించింది. ఈ ఘటనలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలైయ్యాయి.వారు మృత్యువాత పడిన తీరు మాత్రం స్థానికుల్ని విషాదంలో మిగిల్చింది. కుటుంబం అంతా కలిసి భోజనం చేసే సమయంలో ప్రహరీ గోడ కూలి పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
మృతిచెందిన వారిలో నలుగురు మైనర్ బాలికలు, మరో ముగ్గురు మహిళలు ఉన్నారు. కవిత(7), సుగానో (30),మమతా(14), అనిత(30), రాధిక(1), దీపిక(15), జ్యోతి(8)లు మృత్యువాత పడ్డారు. మరో ముగ్గురికి స్వల్ప గాయాలైయ్యాయి. ఇక్కడ కురుస్తున్న వర్షాలకు మరో ఐదు ఇళ్లు కూడా ముంపు గురైయ్యాయి.