వంటగ్యాస్ కోసం మళ్లీ పెళ్లా?
45 ఏళ్ల పుత్తిలాల్ గౌతం నిరుపేద దళితుడు. భార్య చనిపోయింది. నలుగురు పిల్లలు ఉన్నారు. రెక్కల కష్టం మీద బతికే దినసరి కూలీ అయిన పుత్తిలాల్ కు ఇప్పుడో వింత కష్టం వచ్చి పడింది. ఇన్నాళ్లు పుత్తిలాల్ ఇంట్లో ఉన్నది కట్టెలపొయ్యి మాత్రమే. ఇప్పుడు ఉచిత వంటగ్యాస్ కనెక్షన్ పొందాలంటే ఆయన మరో పెళ్లి చేసుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. గ్యాస్ సిలిండర్ కోసం మాకు సవతి తల్లిని తీసుకొస్తావా? అంటూ పిల్లలు తండ్రి రెండోపెళ్లికి నిరాకరిస్తున్నారు. దీంతో ఏం చేయాలో తోచక పుత్తిలాల్ డైలామాలో పడిపోయారు.
ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) పథకం కింద ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందాలంటే ప్రభుత్వ నిబంధనలప్రకారం పుత్తిలాల్ కు భార్య ఉండాలి. అతని కూతుళ్లు చిన్నవారు కావడంతో వారు గ్యాస్ కనెక్షన్ కు దరఖాస్తు చేసుకునే వయస్సు రాలేదు.
ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ సీతాపూర్ జిల్లాలోని జుధువురా గ్రామానికి చెందిన పుత్తిలాల్ ఉచిత గ్యాస్ కనెక్షన్ కోసం స్థానిక ఎల్పీజీ డీలర్ చుట్టు కాళ్లు అరిగేలా తిరుగుతున్నాడు. అయినా స్థానిక డీలర్ నిబంధనలు అనుమతించవంటూ అతన్ని తిప్పి పంపుతున్నాడు. 'సరైన ధ్రువపత్రాలను మీ భార్యకు ఇచ్చి పంపండి. అప్పుడు గ్యాస్ కనెక్షన్ ఇస్తామని వారు చెప్తున్నారు. నా భార్య చనిపోయింది. నాకు నలుగురు పిల్లలు ఉన్నారు. వారి బాగోగులు నేను చూసుకోవాలి అని చెప్పినా వారు వినిపించుకోవడం లేదు. నిబంధనలు ఒప్పుకోవాలని తేల్చిచెప్తున్నారు' అని పుత్తిలాల్ 'హిందూస్థాన్ టైమ్స్' పత్రికకు తెలిపారు.