మద్దతు కోసం తాము విధించిన 18 షరతులకు కాంగ్రెస్ పార్టీ నుంచి సమాధానం రావడంతో దానిపై చర్చించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఘజియాబాద్లో సమావేశమయ్యారు.
మద్దతు కోసం తాము విధించిన 18 షరతులకు కాంగ్రెస్ పార్టీ నుంచి సమాధానం రావడంతో దానిపై చర్చించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఘజియాబాద్లో సమావేశమయ్యారు. అక్కడి కౌశాంబిలో గల పార్టీ కార్యాలయంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గిన మొత్తం 28 మంది సభ్యులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలోనే తుది నిర్ణయం తీసుకుంటామని ఆప్ సభ్యుడు మనీష్ సిసోదియా తెలిపారు. మధ్యాహ్నం మూడు గంటలకు సమావేశం ప్రారంభమైంది. అంతకుముందు రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ఆరుగురు కేజ్రీవాల్ ఇంట్లో కలిశారు. ఎన్నికైన ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు వెళ్లి ప్రజల అభిప్రాయం తెలుసుకుని దాన్నిబట్టి నిర్ణయం తీసుకోవాలని కొందరు ప్రతిపాదించారు. ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోడానికి సోషల్ మీడియాను కూడా ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు.
చివరకు పోస్టుకార్డుల ఉద్యమం మొదలుపెట్టి, ప్రజలకు 25 లక్షల ఉత్తరాలు రాయాలని, వాళ్లేం చెబితే అదే చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు రావాల్సిందిగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఆప్ను ఆహ్వానించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్, ఆప్ కలిస్తే సరిగ్గా కనీస మెజారిటీ 36 సీట్లు వస్తాయి.