న్యూఢిల్లీ: తన ఆదేశాలను పాటించలేదనే కోపంతో ఢిల్లీ జలబోర్డు (డీజేబీ) జూనియర్ ఇంజనీర్‌పై దాడి చేసిన ఆప్ ఎమ్మెల్యే ప్రకాశ్ జర్వాల్‌ను అరెస్టు చేశామని పోలీసులు శుక్రవారం ప్రకటించారు. నిందితుడు, దేవ్లీ ఎమ్మెల్యేపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని ఆగ్నేయ జిల్లా డీసీపీ పి.కరుణాకరణ్ పేర్కొన్నారు. సంగమ్ విహార్‌లో బోరుబావి డ్రిల్లింగ్ పనులను పర్యవేక్షిస్తున్న తమ జూనియర్ ఇంజనీర్‌పై జర్వాల్ దాడి చేశాడని డీజేబీ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేసింది. ఈ ప్రాజెక్టును ఎమ్మెల్యే జర్వాల్ చేతుల మీదుగా ప్రారంభించాల్సి ఉన్నందున, నిర్మాణ పనులు ఆపివేయాలని ఆయన అనుచరులు ఇంజనీర్‌కు సూచించారు.
డ్రిల్లింగ్‌ను మధ్యలో నిలిపివేయడం వల్ల చాలా నష్టం వాటిల్లుతుందని చెబుతూ పనులు కొనసాగించాడు. దీంతో ఆగ్రహం చెందిన ఎమ్మెల్యే ఇంజనీర్‌పై దాడి చేశాడని పోలీసులు తెలిపారు. దీనిపై జర్వాల్ వివరణ ఇస్తూ తాను ఎవరిపైనా దాడి చేయలేదని, ఇంజనీరే తనను తిట్టాడని ఆరోపించారు. లంచం డిమాండ్ చేస్తూ పనులు నిలిపివేయడంతో అతణ్ని ప్రశ్నించానని అన్నారు.