
'నాతోపాటు జగన్ రాజీనామాను ఆమోదించండి'
న్యూఢిల్లీ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి... స్పీకర్ మీరాకుమార్ను కలవనున్నారు. తనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజీనామాను ఆమోదించవలసింది ఆయన ఈ సందర్భంగా స్పీకర్ను కోరనున్నారు. సమన్యాయం చేయాలంటూ వైఎస్ జగన్ ఆగస్ట్ 10న స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆగస్ట్ అయిదును స్పీకర్ ఫార్మాట్లోనే ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా రాజీనామా చేశారు.
రాష్ట్రాన్ని యధాతథంగా ఉంచాలని స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖను పంపినట్లు మేకపాటి తెలిపారు. నిర్బంధంలో ఉండి కూడా వైఎస్ జగన్ తన రాజీనామాను ఫాక్స్ చేశారన్నారు. అన్ని రోజులుగా స్పీకర్ మీరాకుమార్ స్పందిస్తారని అనుకున్నామని... అయితే వారు స్పందించనందునే...తాను స్పీకర్ వద్దకు వెళుతున్నానన్నారు. రాజీనామాలు ఆమోదించాలని స్పీకర్ను కోరుతామని తెలిపారు. స్పీకర్ అపాయింట్మెంట్ అడిగామని, సాయంత్రంలోగా ఇస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.
విభనపై సీమాంధ్ర ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని, కాంగ్రెస్ నేతలు తీవ్ర నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారని మేకపాటి వ్యాఖ్యానించారు. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చిన ప్రజలను కాంగ్రెస్ ఇబ్బంది పడుతోందని...విభజనపై సీమాంధ్ర ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. తొమ్మిదేళ్లు పాలించిన చంద్రబాబు సీమాంధ్ర ప్రజలకు ద్రోహం చేస్తున్నారని, ఒక పద్ధతి, ఒక విధానం లేకుండా బాబు ప్రవర్తిస్తున్నారన్నారు. తనను గెలిపించిన ప్రజలకు బాబు ద్రోహం తలపెట్టారని, ఆయనలాంటి వ్యక్తుల మానసిక స్థితిపై పరిశోధన చేయాల్సిన అవసరం ఉందన్నారు.