ఢిల్లీలో అఖిలేష్, డింపుల్ ప్రచారం
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఆయన భార్య, ఎంపీ డింపుల్ యాదవ్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు. అఖిలేష్ దంపతులతో పాటు సినీ నటి, ఎంపీ జయా బచ్చన్, అఖిలేష్ బాబాయ్ రాంగోపాల్ యాదవ్, పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొత్తం 76 మంది ప్రచారం చేస్తారని ఢిల్లీ ఎస్పీ చీఫ్ ఉషా యాదవ్ చెప్పారు.
ఏప్రిల్ 23న జరిగే ఎంసీడీ ఎన్నికలకు ఎస్పీ తరఫున ప్రచారం చేసే స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ప్రకటించారు. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకున్న ఎస్పీ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. ఎంసీడీ ఎన్నికల్లో మాత్రం ఎస్పీ ఒంటరిగా అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది. త్వరలో అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనున్నట్టు ఉషా యాదవ్ చెప్పారు.
ఎంసీడీ ఎన్నికల్లో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు ఎస్పీ, బీఎస్పీ, జేడీయూ బరిలో ఉన్నాయి. బీజేపీ తరఫున ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రచారం చేస్తారు. 2007 నుంచి ఎంసీడీని బీజేపీ పాలిస్తోంది. ఎంసీడీలో మొత్తం 272 కార్పొరేటర్ల స్థానాలున్నాయి.