
‘సుజనా ఉండొచ్చు.. సామాన్యుడు చావాలా?’
అమరావతి: ‘బ్యాంకుల్లో వందల కోట్ల అప్పులు ఎగ్గొట్టిన సుజనా చౌదరి కేంద్ర మంత్రిగా ఉండొచ్చా? కష్టపడి దాచుకున్న సొంత డబ్బు తీసుకోవడానికి క్యూలో నిలబడి చనిపోవాలా? ఇదెక్కడి నీతి?’ అని పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి ప్రశ్నించారు. నోట్ల రద్దు నిర్ణయం వెలువడిన నాటి నుంచి నేటి వరకు బ్యాంకులు, ఏటీఎంల వద్ద చోటుచేసుకున్న మరణాలకు ప్రధాని మోదీ బాధ్యత వహించాలని అన్నారు.
నోట్ల రద్దుపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ దేశవ్యాప్తంగా నిర్వహించిన ఆందోళనల్లో భాగంగా సోమవారం విజయవాడలో కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ తీసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రఘువీరా.. బ్యాంకులు, ఏటీఎంల వద్ద చనిపోయినవారి కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెద్ద నోట్ల రద్దు ఓ భారీ కుంభకోణమని, ఇందులో ఏపీ సీఎం చంద్రబాబుకు కూడా భాగస్వామ్యం ఉందని రఘువీరా ఆరోపించారు. ప్రజలు కష్టాలు పడుతుంటే చంద్రబాబు తేలు కుట్టిన దొంగలా వ్యవహరిస్తున్నారని, ప్రధాని మోదీని 21వ శతాబ్దపు తుగ్లక్‌గా ప్రజలు విమర్శిస్తున్నారని చెప్పారు.