
సాక్షి, న్యూఢిల్లీ : నోట్ల రద్దు అనంతరం ప్రవేశపెట్టిన 2 వేల రూపాయల నోటును కేంద్ర ప్రభుత్వం వెనక్కితీసుకుంటుందనే ప్రచారంపై ప్రభుత్వం స్పందించింది. రూ.2000 నోట్లను రద్దు చేస్తామని సాగుతున్న ప్రచారం అవాస్తవమని ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. రాజ్యసభలో మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో రాబోయే రోజుల్లో రూ. 2000 నోటును ప్రభుత్వం ఉపసంహరిస్తుందా అన్న ప్రశ్నకు బదులిస్తూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
రూ. 2000 నోటును ప్రవేశపెట్టడంతో దేశంలో నల్లధనం పెరిగిపోయిందని, దాని స్ధానంలో ప్రభుత్వం తిరిగి రూ.1000 నోటును ప్రవేశపెడుతుందని ప్రజల్లో ఓ ప్రచారం సాగుతోందని ఎస్పీ సభ్యుడు విశ్వంభర్ ప్రసాద్ నిషద్ ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. నల్లధనాన్ని నిర్మూలించి నకిలీ నోట్లను తొలగించేందుకే నోట్ల రద్దును ప్రభుత్వం చేపట్టిందని మంత్రి ఠాకూర్ చెప్పారు. అసంఘటిత రంగాన్ని సంఘటితపరచడంతో పాటు తీవ్రవాద నిర్మూలన లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం ద్వారా ఆన్‌లైన్ లావాదేవీలను నోట్ల రద్దు ద్వారా పెంచగలిగామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment