న్యూడిల్లీ: పెద్ద నోట్ల రద్దు తర్వాత నోట్ల మార్పిడిపై దేశ అత్యున్నత ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. డీమానిటైజేషన్‌లో భాగంగా రద్దయిన పాత నోట్లను మార్చుకునేందుకు ఈ నెలాఖరు వరకూ ఇచ్చిన గడువు అమలు కాకపోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) విచారణకు సుప్రీం అంగీకరించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు నోటీసులు జారీ చేసింది. చీఫ్ జస్టిస్ జే.ఎస్ ఖేహర్ నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై సమాధానం చెప్పాల్సిందిగా కేంద్రాన్ని కోరింది. ఈ నెల10వ తేదీ లోపు కేంద్రం స్పదించాల్సిందిగా ఆదేశించింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతన ప్రసంగంలో 31 డిసెంబర్ 2016కి ముందు పాతనోట్లను డిపాజిట్ చేయలేని వ్యక్తులెవరైనా ఆర్‌బీఐ ప్రత్యేక బ్రాంచ్‌లలో రద్దయిన పాతనోట్లను డిపాజిట్ చేసుకోవచ్చని స్పష్టంగా పేర్కొన్నారని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదించారు
కాగా నవంబర్ 8 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెద్దనోట్ల రద్దును ప్రకటించారు. రద్దయిన నోట్లను ఆయా బ్యాంకులలో మార్పిడికి గాను డిశెంబర్ 30, 2016 వరకు గడువును నిర్ణయించారు. అయితే ప్రత్యేక పరిస్థితుల్లో రద్దయిన పెద్ద నోట్లను ఆర్బీఐలో జమ చేసుకునేందుకు మార్చి 31, 2017 వరకు కేంద్రం గడువు ఇచ్చింది. అయితే కేంద్ర ప్రభుత్వం వాగ్దానం మేరకు మార్చి 31, 2017 వరకు రద్దయిన పాతనోట్ల డిపాజిట్‌కు అనుమతి నిరాకరించడంపై పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.