![ఏఆర్ రెహమాన్ ఆసక్తికర వ్యాఖ్యలు](/styles/webp/s3/article_images/2017/09/5/71491396099_625x300.jpg.webp?itok=hbV0n1KR)
ఏఆర్ రెహమాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
హైదరాబాద్: ఐఫా ఉత్సవాల్లో భాగంగా బుధవారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని టీ-హబ్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన స్వరమాత్రికుడు ఏఆర్ రెహమాన్.. తెలంగాణ సర్కారును ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
'క్రియేటివిటీ ఇన్ ఇన్నోవేషన్' అనే అంశంపై జరిగిన ప్యానల్ డిస్కషన్‌లో రెహమాన్, సౌండ్ డిజైనర్ రసూల్ పోకుట్టి, తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్‌లు పాల్గొన్నారు. నిర్దేశిత అంశంపై దాదాపు గంటపాటు సాగిన డిస్కషన్‌లో రెహమాన్, రసూల్‌లు అనేక విషయాలు చెప్పుకొచ్చారు.
రెహమాన్ మాట్లాడుతూ.. 'ఇది(టీ-హబ్) గవర్నమెంట్ బిల్డింగ్ కదా.. చాలా బాగుంది. ఇక్కడి గవర్నమెంట్ కూడా నాకు బాగా నచ్చింది'అని ప్రశంసించారు. అటుపై తన కెరీర్ ప్రారంభాన్ని గుర్తుచేసుకుంటూ.. సంగీతమే జీవితం అవుతుందని తానెప్పుడూ అనుకోలేదని చెప్పారు. 'సంగీతం కోసమే నేను పుట్టానన్న విషయం నాకెప్పుడూ తెలియదు. కానీ మా అమ్మ మాత్రం దాన్ని బలంగా నమ్మింది. ఏనాటికైనా నేనొక మంచి సంగీతకారుణ్ని అవుతానని ఆమె విశ్వసించింది. కెరీర్ ప్రారంభంలో.. సంగీత పరికరాలు, సరంజామా ఏదీ లేని నా రికార్డింగ్ రూమ్‌లో కూర్చొని.. ఎప్పటికైనా ఈ గదినిండా సంగీత పరికరాలు నిండిపోవాలని అనుకునేవాణ్ని' అని రెహమాన్ చెప్పారు.
'1986 తర్వాత బయటి సంగీత దర్శకుల దగ్గర పని చేయడం మానేసి, సొంతగా ప్రాక్టీస్ మొదలుపెట్టా. నిరంతరం నేర్చుకోవడం, సాధన చేయడమే సంగీత రంగంలో అసలైన పెట్టుబడి. అవకాశాల గురించి ఆలోచించకుండా సాధనపైనే దృష్టిపెట్టా. మనం ఎంత సమర్థులమైతే మన దగ్గరికి అంతమంది వస్తారు. ఆ తర్వాత మన స్థాయిని ఇంకాస్త మెరుగుపర్చుకోవాలి. మరింత ఉత్సాహాన్ని నింపుకోవాలి. అప్పుడు వెనకబడిపోవటం అనేది జరగదు' అని రెహమాన్ సందేశం ఇచ్చారు.
రసూల్ పోకుట్టి మాట్లాడుతూ 'సౌండ్ మిక్సింగ్ అనేది కూడా ఓ కళేనని నాకు అవార్డు ('స్లమ్‌డాగ్ మిలియనీర్'కు) వచ్చేదాకా చాలా మందికి అర్థం కాలేదు. సౌండ్ మిక్సింగ్‌లో ఆసియా వాసికి ఆస్కార్ రావడానికి 81 ఏళ్లు పట్టిందటేనే అర్థం చేసుకోవచ్చు.. దానిపై మనకున్న అవగాహన ఏమిటో! మనం ఏం చదివామనేది కాకుండా ఎంత నేర్చుకున్నాం అనేదానిపైనే నిలదొక్కుకోగలం'అని అన్నారు.